-
ఇక నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్
-
జగన్మోహన్ రెడ్డితో కీలక భేటీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని యాక్టివ్ అవుతారా? ఇకనుంచి గుడివాడ నియోజకవర్గానికి అందుబాటులో ఉంటారా? కృష్ణా జిల్లా బాధ్యతలను తీసుకుంటారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కొడాలి నాని. అనారోగ్య రీత్యా అని చెబుతున్న.. కూటమి ప్రభుత్వం కేసులకు భయపడి ఆయన ముందుకు రాలేదన్న ప్రచారం సాగింది. అయితే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డిని కొడాలి నాని ప్రత్యేకంగా కలిసినట్లు చర్చ నడుస్తోంది. పార్టీలో యాక్టివ్ అవుతానని చెప్పినట్లు సమాచారం.
వివాదాస్పద ముద్ర..
కొడాలి నాని పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదమైన నేతగా గుర్తింపు సాధించారు. 2019 నుంచి 2024 మధ్య మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. వారిని నిత్యం వ్యక్తిగతంగా దూషించేవారు. మంత్రి పదవి పోయినా.. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం విరుచుకుపడేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనిపించకుండా మానేశారు. అనారోగ్యానికి కూడా గురయ్యారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో గుండెపోటు ఆపరేషన్ కూడా జరిగింది. అయితే అప్పుడప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్న ఆయన మునుపటిలా వ్యవహరించడం లేదు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది.
టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. 2004లో తొలిసారిగా గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు టిడిపి ఎమ్మెల్యేగా. 2009లో రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అందులో చేరారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు గుడివాడ నుంచి. 2019లో కొడాలి నాని నాలుగోసారి గెలిచేసరికి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2024 లో మాత్రం ఓడిపోయారు. అయితే దూకుడు కలిగిన నేత కావడంతో ఆయనపై కేసులు నమోదవుతాయని అంతా భావించారు. కానీ ఇంతలో ఆయన అనారోగ్యానికి గురికావడంతో అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి యాక్టివ్ కావాలని కోరడంతో కొడాలి నాని.. పార్టీలో క్రియాశీలకం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆనందం చేకూర్చే విషయమే.