*పూర్వ వైభవం కోసం తహతహ
*అభివృద్ధితో పట్టు కొనసాగిస్తున్న కూటమి
*అదే స్తబ్దత పాటిస్తున్న రెడ్డి సామాజిక వర్గం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- రాయలసీమలో పొలిటికల్ సీన్ మారుతోంది. గతానికి భిన్నంగా అక్కడ పరిస్థితి ఉంది. అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తోంది కూటమి. దీంతో గత వైభవం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. దానికి కారణం పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో అక్కడ నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో కూడా సంతృప్తి శాతం ఉంది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టించే అంశం.
దారుణ ఓటమితో..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది రాష్ట్రంలో. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే వచ్చిన సీట్లలో రాయలసీమలో అధికం. అక్కడ ఆ పార్టీకి ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ సీట్లు వచ్చాయి. అందుకే అక్కడ ఎలాగైనా పూర్వ వైభవం దిశగా అడుగులు వేయవచ్చని భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవు. అక్కడ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉంది. స్థానిక ఎమ్మెల్యేలపై భిన్న వైఖరి ఉన్న ప్రభుత్వ పెద్దల పట్ల మాత్రం సానుకూలత ఉంది. వారి పనితీరు పట్ల అక్కడ ప్రజలు సంతృప్తి గానే ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది రుచించని అంశం.
చివరి వరకు వేచి చూసే ధోరణిలో
ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఆ సామాజిక వర్గం యూటర్న్ తీసుకుంటుందని అంచనా వేసింది. రాయలసీమలో ఆ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు తిరిగి వైసీపీలోకి వస్తాయని అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా ఉంది అక్కడ పరిస్థితి. వైసీపీ హయాంలో రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ ఐదేళ్లపాటు ఆ వర్గానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనాలు లేవు. సంక్షేమ పథకాలు కూడా ఓసీలుగా ఉండడంతో అందలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాదు. భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తోంది. పారిశ్రామిక వర్గాలను కూడా ప్రోత్సహిస్తుంది. గతానికి భిన్నంగా శాంతిభద్రతలు కూడా బాగున్నాయి. అన్నింటికీ మించి పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్న ఆశ నిరుద్యోగ యువతలో ఉంది. అందుకే ప్రభుత్వం పై సంతృప్తి శాతం పెరుగుతుండడంతో ఏం చేయాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాలు పోవడం లేదు.
రాజకీయంగా కూటమి పట్టు..
రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో చాలామంది రెడ్డి సామాజిక వర్గం నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రకాశం తో పాటు నెల్లూరు జిల్లాలో సైతం ఎన్నికలకు ముందు, తరువాత చాలామంది పార్టీకి రాజీనామా చేశారు. అటువంటి వారు నిర్ణయం మార్చుకుంటారని అంతా భావించారు. కానీ అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయంగాను కూటమి పట్టు బిగించింది. పైగా కేంద్రంలోని బిజెపి కూటమికి అండదండలు అందిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల ముంగిట పరిస్థితి చూసి అడుగులు వేయాలని చాలామంది భావిస్తున్నారు. అందుకే వైసీపీలో చేరాలన్న విన్నపాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. మొత్తానికైతే రాయలసీమలో కూటమి పట్టు కొనసాగిస్తుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు.