క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది.
ప్రకాశ్ రాజ్ తన సోషల్ మీడియా పోస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తూ.. “బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు?” అంటూ విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్పే “బేటీ బచావో” నినాదాన్ని ప్రస్తావిస్తూ.. “ఇది బేటీ బచావోనా..? బేటా బచావోనా..?” అంటూ సెటైర్లు వేశారు.
ఈ కేసులో బండి భగీరథ్‌పై తొలుత తక్కువ తీవ్రత కలిగిన సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కఠినమైన పోక్సో సెక్షన్లు జోడించినట్లు సమాచారం. ప్రస్తుతం కేసు విచారణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇక బండి భగీరథ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ.. ఇది కుట్ర అని, తనను హనీట్రాప్‌లో ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ కౌంటర్ కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు కూడా తెలుస్తోంది.
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeForVictim వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.