కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 10 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు మే 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
బంగారం దిగుమతుల తగ్గింపునకు కీలక నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత విదేశీ మారక నిల్వలపై పడుతోంది. ఈ నేపథ్యంలో దిగుమతులను కొంతవరకు తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే హింట్ ఇచ్చిన ప్రధాని మోదీ
ఇటీవల ప్రధాని మోదీ ప్రజలకు బంగారం కొనుగోళ్లపై సూచనలు చేశారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల కోసం కొంతకాలం బంగారం కొనకుండా ఉండాలని కోరారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో బంగారం, వెండి, ప్లాటినంతో తయారయ్యే ఆభరణాల్లో ఉపయోగించే చిన్న భాగాలపై కూడా సుంకాలు పెరిగాయి. హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వస్తువులపై కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. బంగారం, వెండి ఫైండింగ్స్పై 5 శాతం కస్టమ్స్ డ్యూటీ విధించగా, ప్లాటినం ఫైండింగ్స్ పై 5.4 శాతం సుంకం నిర్ణయించారు.
భారీగా బంగారం దిగుమతి చేసుకుంటున్న భారత్
ప్రస్తుతం ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో స్విట్జర్లాండ్, యూఏఈ, దక్షిణాఫ్రికా ప్రధాన సరఫరాదారులుగా కొనసాగుతున్నాయి.