భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని, ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ సమయానికి ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్-నికోబార్ దీవుల ప్రాంతాల్లో ఈ వారాంతంలోనే నైరుతి రుతుపవనాలు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
ఐఎండీ విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇంకా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన తుఫాన్ వలయం సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ వ్యవస్థ రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అంచనా వేసింది. దీని ప్రభావంతో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రతి సంవత్సరం మే 20 ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు మొదట అండమాన్ ప్రాంతాన్ని తాకుతాయి. ఆ తర్వాత క్రమంగా భారత ప్రధాన భూభాగం వైపు కదులుతూ జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని చేరుకుంటాయి. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నందున రుతుపవనాలు కొంత ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎల్నినో ప్రభావంపై ఆందోళన
అయితే మరోవైపు ఎల్నినో ప్రభావంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ రుతుపవనాల ప్రారంభం ముందుగానే కావడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.