దేశవ్యాప్తంగా వైద్య విద్య ఆశావహుల్లో తీవ్ర కలకలం రేపుతున్న నీట్ యూజీ 2026 పరీక్ష వివాదం రోజురోజుకీ మరింత ముదురుతోంది. పరీక్షలో మొత్తం 720 మార్కులకు గానూ బయటకు వచ్చిన కేవలం 140 ప్రశ్నలకే దాదాపు 600 మార్కులు కేటాయించబడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించడం సంచలనంగా మారింది. అంతేకాదు, ఆ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు తేలడంతో పేపర్ లీక్ ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. గెస్ పేపర్ తరహాలో రూపొందించిన ఈ మెటీరియల్ మే 1న రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో విస్తృతంగా చక్కర్లు కొట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మెటీరియల్‌ను విద్యార్థులు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు భారీ మొత్తాలు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్ష జరిగిన రోజు రాత్రికల్లా ఒక్కో కాపీ రూ.30 వేల వరకు అమ్ముడైనట్లు దర్యాప్తులో బయటపడింది. ఇది నిజంగా పేపర్ లీక్‌లో భాగమా, లేక ప్రాక్టీస్ కోసం తయారు చేసిన ప్రశ్నల సమాహారమా అన్న అంశంపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
దర్యాప్తు సంస్థల ప్రకారం.. ఈ మెటీరియల్ రూపకల్పన కోచింగ్ సంస్థలు నిర్వహించే టెస్ట్ సిరీస్‌లను పోలి ఉందని భావిస్తున్నారు. అయితే దీని వెనుక ఒక పెద్ద స్థాయి సంఘటిత ముఠా పనిచేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పలు నగరాల్లో సోదాలు, విచారణలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో కేరళకు చెందిన ఒక విద్యార్థి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మే 1న సికార్‌లో ఈ మెటీరియల్‌ను కొనుగోలు చేసిన అతడు, కొన్ని గంటల వ్యవధిలోనే కేరళలోని కోచింగ్ నెట్‌వర్క్‌లు, పీజీలు, కెరీర్ కౌన్సెలర్లు, నీట్ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు విచారణలో బయటపడింది. పరీక్ష అనంతరం ఒక పీజీ నిర్వాహకుడు పోలీసులకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సికార్, డెహ్రాడూన్ ప్రాంతాల్లో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది మే 3, 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా ఒకే విడతలో నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. భారత్‌తో పాటు విదేశాల్లో కలిపి మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 13.32 లక్షల మంది మహిళా అభ్యర్థులు కాగా, దాదాపు 9.46 లక్షల మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. పరీక్షకు కొన్ని రోజుల ముందే ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు సమాచారం రావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. గతంలో కూడా నీట్ పరీక్షల సమయంలో పేపర్ లీక్‌లు, అవకతవకలు వెలుగులోకి రావడం తెలిసిందే. దీంతో తాజా ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మే 3న జరిగిన పరీక్షను పూర్తి భద్రతా ప్రమాణాలతో నిర్వహించామని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రాలకు ప్రత్యేక వాటర్‌మార్క్ గుర్తింపు చిహ్నాలు ఇచ్చినట్లు తెలిపింది. అలాగే జీపీఎస్ సదుపాయం కలిగిన వాహనాల ద్వారా ప్రశ్నాపత్రాలను రవాణా చేసినట్లు పేర్కొంది. పరీక్షా కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ అమలు చేసినట్లు వెల్లడించింది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ ధృవీకరణ నిర్వహించడంతో పాటు 5జీ సిగ్నల్ జామ్మర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అన్ని కేంద్రాల్లో పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నామని, పరీక్షా ప్రక్రియ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఎన్టీఏ స్పష్టం చేసింది.
అయితే పరీక్ష ముగిసిన నాలుగు రోజుల తర్వాత మాత్రమే లీకేజీకి సంబంధించిన సమాచారం తమకు అందినట్లు ఎన్టీఏ పేర్కొంది. మే 7 రాత్రి ఈ సమాచారం అందిందని, మరుసటి రోజు ఉదయం మే 8న కేంద్ర దర్యాప్తు సంస్థలకు వివరాలు పంపినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయాలకు రావొద్దని సూచించింది. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా, 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్ష వివాదం కూడా మళ్లీ చర్చకు వస్తోంది. అప్పట్లో దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నిరసనలు, కోర్టు కేసులు, రాజకీయ విమర్శల నడుమ సీబీఐ దర్యాప్తు కూడా జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మొత్తం పరీక్షను రద్దు చేసే స్థాయిలో వ్యవస్థాగత ఉల్లంఘనలకు ఆధారాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసింది. కానీ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో నమ్మకం దెబ్బతిన్నదనే అభిప్రాయాలు అప్పటినుంచే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మరోసారి భారీ భద్రతా చర్యలు అమలు చేసినప్పటికీ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలు రావడం విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై మరిన్ని సందేహాలకు దారితీస్తోంది.
ALSO READ: జోష్‌లో కమలం నేతలు…తెలంగాణలో జెండా పాతేందుకు వ్యూహం…!