HomeజాతీయంSuvendu Pa Murder: సువేందు అధికారి పీఏ హత్యకేసు.. ఐజీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు!

Suvendu Pa Murder: సువేందు అధికారి పీఏ హత్యకేసు.. ఐజీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు!

Bengal Violence: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఏపీ చంద్రనాథ్ హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశారు. ఇప్పటికే సంఘటన జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలు సేకరించడం ప్రారంభించిన అధికారులు సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు తమకు లభించాయని పోలీసులు చెబుతున్నారు.

అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ కేసులో ఇప్పటివరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ప్రధాన నిందితులు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. గతంలో నేరచరిత్ర ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చంద్రనాథ్ హత్య వెనుక సుపారీ కోణం కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చంద్రనాథ్ భారత వైమానిక దళంలో మాజీ అధికారిగా పని చేసిన వ్యక్తి కావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఆయన హత్య రాజకీయ కారణాలతో జరిగిందా? లేక వ్యక్తిగత విభేదాల కారణమా? అన్న దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.

బెంగాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

అటు బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కూడా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కోల్‌ కతా, బీర్భుమ్‌, హౌరా ప్రాంతాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. హౌరా జిల్లా శివపురిలో జరిగిన కాల్పులు, రాళ్ల దాడుల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు