పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె సొంత నియోజకవర్గం భవానీపుర్‌లో ఊహించని షాక్ తగిలింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన దీదీ తన సొంత గడ్డపైనే పరాజయం చెందడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సువేందు అధికారి తన వ్యూహాలతో మమతను నిలువరించి ఘనవిజయం సాధించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయంతో దూసుకుపోతోంది. మొత్తం 294 స్థానాలకు గాను భాజపా 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో కమలనాథులు అనుసరించిన అభివృద్ధి మంత్రం బెంగాల్ ఓటర్లను ఆకట్టుకుంది. మరోవైపు పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అత్యంత దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టీఎంసీ కేవలం 72 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరో 7 చోట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వీచిన భాజపా గాలికి తృణమూల్ కంచుకోటలు బద్ధలయ్యాయి. ముఖ్యమంత్రి ఓడిపోవడం.. పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంపై తృణమూల్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. ఈ ఫలితాలు బెంగాల్ రాజకీయాల్లో ఒక నవశకానికి నాంది పలికాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సువేందు అధికారి విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యతను మరింత పెంచింది. భాజపా కార్యకర్తలు రాష్ట్రమంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ఈ మార్పు బెంగాల్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.
ALSO READ: ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరం.. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే ఎలక్షన్స్: ప్రధాని మోదీ