Homeతెలంగాణధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పిపిసి కేంద్రాలకు ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా 13.32 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో హమాలీలు, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు.

అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద తగినన్ని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోళ్లు చురుగ్గా సాగేలా చూడాలన్నారు. మెరుపులు, వానల సమయంలో రైతులు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐకెపి, పిఎసిఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం లేకుండా రైస్ మిల్లులకు పంపాలని సూచించారు. రవాణా సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి చెల్లింపులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.

ALSO READ: రజినీ, చిరు వల్ల కానిది.. విజయ్ చేసి చూపించాడు, రాజీకాయాల్లోనూ సూపర్ స్టార్‌గా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు