ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ కూటమి సాధించిన విజయం అభివృద్ధికి జాతీయవాదానికి ప్రజలు ఇచ్చిన తీర్పని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల సామాన్య ప్రజానీకంలో నమ్మకం పెరిగిందనడానికి ఈ ఫలితాలే సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీలను త్రిమూర్తులుగా అభివర్ణిస్తూ వారి నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలపై స్పందిస్తూ మమతా బెనర్జీ అరాచక పాలనను అక్కడి ప్రజలు తిరస్కరించారని బండి సంజయ్ విమర్శించారు. చొరబాటుదారుల అండతో గెలవాలని చూసిన టీఎంసీ కుట్రలు పారలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ కేంద్ర మంత్రులను దూషించిన టీఎంసీకి ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారన్నారు. బెంగాల్‌లో 200 పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చడం కార్యకర్తల త్యాగాల ఫలితమేనని స్పష్టం చేశారు. అస్సాంలో హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ చేసిన విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా అడుగులు పడ్డాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన రేవంత్ గేమ్ ఛేంజర్ ఎలా అవుతారని ప్రశ్నించారు. తమిళనాడు, అస్సాంలలో రేవంత్ ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. “సినిమా హిట్ అయితే ఐటమ్ సాంగ్ చేసిన వాళ్లు తమ వల్లే హిట్ అయిందని చెప్పుకున్నట్లు రేవంత్ వ్యవహారం ఉంది” అని ఎద్దేవా చేశారు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత అన్న చందంగా తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల సొమ్మును కేరళ ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో కేసీఆర్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలనే రేవంత్ రెడ్డి పాటిస్తున్నారని ఆయనకు కూడా కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అస్సాం నుంచి బెంగాల్ వరకు వీస్తున్న కాషాయ గాలి త్వరలోనే తెలంగాణను ముంచెత్తుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధానమంత్రి మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలకాలని కార్యకర్తలను కోరారు.
ALSO READ: విజయ్‌పై నాని కామెంట్ వైరల్… పరోక్షంగా పవన్ గురించి ప్రస్తావన..!