గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగిన మే డే వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూనే బిఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ ఆవిర్భావంపై మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాటాల పంపకాల్లో తలెత్తిన తీవ్ర విభేదాల నుండే కవిత పార్టీ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కూతురు పెట్టిన కుంపటి కారణంగానే కేసీఆర్ ప్రస్తుతం బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లు అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడిందని విమర్శించారు.
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనను ప్రశ్నిస్తూ తాము అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చామని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని అని ఆయన నిలదీశారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేసీఆర్ లేదా కేటీఆర్‌లకు లేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌దేనని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. తమకు ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అలాగే కేసీఆర్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందం కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపడంలో కేంద్ర ప్రభుత్వం వెనకాడుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యమని ధ్వజమెత్తారు. బీజేపీ, బిఆర్ఎస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని వెల్లడించారు. వచ్చే రెండు మూడు రోజుల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన ఉంటుందన్నారు. మే నెలలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ALSO READ: రోడ్ల టెండర్లలో రూ. 5,000 కోట్ల భారీ దోపిడీ.. హరీష్ రావు సంచలన ఆరోపణలు