-
డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య
-
ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహావేశాలు
-
వెనువెంటనే స్పందించిన ప్రభుత్వం
-
నలుగురు అధికారులకు చర్చల బాధ్యతలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరం అవుతోంది. గత మూడు రోజులుగా సమ్మె చేపడుతున్న ఆర్టీసీ కార్మికులు మరింత దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడికక్కడే బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట బస్సు డిపోకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మాహుతికి ప్రయత్నించారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఆయన ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బలిదానాలకు సిద్ధం అని ఆర్టీసీ కార్మికులు సంకేతాలు పంపడం సంచలనంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ ప్రాణాలు వదలడంతో ఆర్టీసీ ఉద్యమం మరో స్థాయికి చేరే ఛాన్స్ కనిపిస్తోంది.
యూనియన్ నేతలతో చర్చలు..
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మబలిదానంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వంపై. మరోవైపు ప్రభుత్వ వర్గాల్లో సైతం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారం పై ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కార్మికులతో చర్చలు కూడా జరుగుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దాన కిషోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మిక యూనియన్లు చేసిన విన్నపాలను విన్న అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిస్తామని.. తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. అయితే కార్మికుడి ఆత్మ బలిదానంతో ప్రభుత్వ వర్గాల్లో కూడా ఒక్కసారిగా ఆందోళన ప్రారంభం అయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపునకు దారితీస్తుందో అన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
కార్మికులకు బాసటగా ప్రతిపక్షాలు..
మరోవైపు ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రతిపక్ష పార్టీలు కార్మికులకు బాసటగా నిలుస్తున్నాయి. బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తుందని మండిపడ్డారు. మరోవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కార్మికులు సహనంతో వ్యవహరించాలని కోరారు.