* ఓవర్ డోస్ తో మరణించిన కేదార్
* ఆయన ద్వారా దుబాయిలో పెట్టుబడులు
* సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
* పైలెట్ రోహిత్ రెడ్డి నోరు విప్పితే మరిన్ని సంచలనాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది మోయినాబాద్ డ్రగ్స్ కేసు. కొద్ది రోజుల కిందట ఫామ్ హౌస్ లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజకీయ ప్రకంపనలకు కారణం అయ్యింది. ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న కొద్దీ ఈ వ్యవహారం వెనుక ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దుబాయిలోని డ్రగ్స్ రాకెట్ ఎపిసోడ్ మరింత సంచలనాలకు కారణం అవుతోంది. మరిన్ని సంచలనాలకు తెరతీసే అవకాశం కనిపిస్తోంది.
ఎవరీ కేదార్?
దుబాయిలో డ్రగ్స్ ఓవర్ డోస్ తో కేదార్ అనే వ్యక్తి మరణించారు. అతనితో కెప్టెన్ రోహిత్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని.. స్నేహ సంబంధాలు కొనసాగాయని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అదే కేదార్ తో బిఆర్ఎస్ అగ్రనేతలకు ఉన్న సాన్నిహిత్యం పై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగుతున్నాయి. పోలీస్ విచారణలో భాగంగా రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి ఖాతాల నుంచి అదే కేదార్ కు దాదాపు 25 లక్షల రూపాయల బదిలీ జరిగినట్లు ప్రత్యేక అధికారుల బృందం తన విచారణలో గుర్తించింది. కేదార్ మరణించినప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారన్నది పోలీసుల అనుమానం. దానిపై కూడా ఆరా తీస్తున్నారు.
పెట్టుబడులు మేనేజ్ చేసే వ్యక్తిగా..
దుబాయిలో కేదార్ సర్వసాధారణ వ్యక్తి కాదు అని పోలీసుల విచారణలో తేలినట్లు ప్రచారం సాగుతోంది. దుబాయిలో ప్రముఖులకు చెందిన ఆస్తులను, పెట్టుబడులను మేనేజ్ చేసే కీలక వ్యక్తి అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డిని డ్రగ్స్ కేసులో విచారిస్తుంటే… ఈ కేసు మూలాలు మెల్లగా దుబాయ్ పెట్టుబడుల వైపు మళ్లీనట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కేసుల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు విస్తృతం అవుతున్నాయి. కేదార్ ద్వారా దుబాయిలో బినామీ ఆస్తుల నిర్వహణ జరిగిందని.. ఆ గుర్తు బయటపడకుండా ఉండేందుకే రోహిత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
కాంగ్రెస్ కుట్ర అంటున్న గులాబీ పార్టీ..
డ్రగ్స్ కేసుతో భారత రాష్ట్ర సమితిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో అనవసరంగా కేటీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారని ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని… కేటీఆర్ ను ఇరుకున పెట్టేందుకు చేస్తున్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి నోరు విప్పితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనమే. అయితే ఈ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్న క్రమంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే ఛాన్స్ కనిపిస్తోంది. అదే క్రమంలో గులాబీ పార్టీలో మాత్రం సెగలు రేపుతోంది.
