Homeఆంధ్ర ప్రదేశ్రావాలి జగన్ కావాలి మావిగన్!

రావాలి జగన్ కావాలి మావిగన్!

  • కొత్త నినాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ

  • రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు

  • వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకే..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మావిగన్ రాజధాని ప్రతిపాదన విషయంలో ఎన్ని రకాలు విమర్శలు వచ్చిన తగ్గేదేలే అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెబుతోంది. కొద్ది రోజుల కిందట మచిలీపట్నం – విజయవాడ- గుంటూరు కారిడార్ ను మావిగన్ పేరిట కొత్త రాజధాని ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి చేశారు. దీనిపై అనుకూలత కంటే ప్రతికూలత అధికంగా వచ్చింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఏకంగా ఫ్లెక్సీలు వేసి మావిగన్ కు మద్దతు తెలుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్ కావాలి జగన్’ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఈసారి వినూత్నంగా రావాలి జ’గన్’ కావాలి మావి’గన్’ అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు.

జగన్ ఇంటి ముందు..
అయితే మావిగన్ రాజధాని ప్రతిపాదన విషయంలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని నియంత్రించేందుకే ఈ ఫ్లెక్సీల ప్రయత్నం అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఈ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ముందుగా ఆ పార్టీ నేత కారుమూరి వెంకట్ రెడ్డి పేరుతో భారీగా ఫ్లెక్సీలు వచ్చాయి. ఇప్పుడు పార్టీ నేత దేవినేని అవినాష్ సైతం ఇదే తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తాడేపల్లిలో ఈ ఫ్లెక్సీలతో ఇప్పుడు నింపేస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్న క్రమంలో ఈ ఫ్లెక్సీలు వెలుస్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రజలనుంచి వ్యతిరేకత..
జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదన పై రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. మాట తప్పను మడమ తిప్పను అన్న ఆయన మాటను గుర్తు చేస్తున్నారు ఎక్కువ మంది ప్రజలు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు కూడా అమరావతి రాజధాని ఉంటుందని ప్రచారం చేశారు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. కానీ వాటిని సైతం పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దీనిపై సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ప్రారంభం అయింది. అయితే ప్రతికూల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మావిగన్ పేరిట ఫ్లెక్సీలు వెలుస్తుండడం విశేషం.

సీనియర్లలో ఆందోళన..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం ఈ పరిణామాలపై ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే మావిగన్ ప్రతిపాదనతో పొలిటికల్ గా డ్యామేజ్ జరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. ప్రధానంగా విశాఖ నగర ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును దుయ్యబడుతున్నారు. అదే సమయంలో గుంటూరు తో పాటు కృష్ణాజిల్లా ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు ఆగ్రహంతో ఉంటే ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు వేయడంపై మరింత వ్యతిరేకత అయితే ఈ విషయంలో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు