క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ.. ఆంధ్రను వ్యతిరేకించే పార్టీగా ముద్ర పడింది. ప్రధానంగా చంద్రబాబు అంటే కెసిఆర్ కు పడదు. దశాబ్దాలుగా వారి మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది. కానీ తాజాగా అమరావతికి చట్టబద్ధత బిల్లును సమర్ధించింది కేసీఆర్ పార్టీ. భారత్ రాష్ట్ర సమితి రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి.. పొరుగు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బిఆర్ఎస్ గళం ఎత్తడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని అర్థమవుతోంది..
రాజ్యసభలో బిల్లుకు మద్దతు..
ఇటీవల కేంద్రం అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. లోక్ సభలో కెసిఆర్ పార్టీకి కనీసం ప్రాతినిధ్యం లేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీ ఎంపీలు ఉన్నారు. ఒక్కసారిగా వారు అమరావతి బిల్లుకు మద్దతుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా కెసిఆర్ మార్చిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా దానిని విస్తరించారు. ఆ సమయంలోనే ఏపీ రాజధాని విషయంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. గతంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులైన సంగతి తెలిసిందే. అప్పుడే అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తున్నట్లు కేసిఆర్ సంకేతాలు పంపారు. అయితే తర్వాత అధికారం కోల్పోవడం.. జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం కోల్పోవడంతో కెసిఆర్ మాత్రం చంద్రబాబుపై అదే ధోరణితో ముందుకు సాగుతున్నారు. కానీ ఇప్పుడు అమరావతికి అనుకూల నిర్ణయం తీసుకోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
చంద్రబాబుతో శత్రుత్వం ఉన్నా..
ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి కెసిఆర్ కు ఆత్మీయ మిత్రుడు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి శత్రువు కాబట్టి ఆయనతో స్నేహం కొనసాగించారు. అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అదే రాజ్యసభలో వైసీపీ ఎంపీలు అమరావతికి చట్టబద్ధతపై వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. కానీ కెసిఆర్ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రం సమర్థిస్తూ గళం ఎత్తారు. అయితే దీనిపై అనేక రకాల చర్చ నడుస్తోంది. అయితే అమరావతికి గులాబీ పార్టీ మద్దతు ఇవ్వడం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా అమరావతిని భావిస్తారు. తెలంగాణలోని రంగారెడ్డి తో పాటు గ్రేటర్ పరిధిలో ఆంధ్ర సెటిలర్స్ అధికం. అమరావతిని వ్యతిరేకించి అనవసరంగా వారిని దూరం చేసుకోవడం అవుతుంది. ఒకవేళ అమరావతికి వ్యతిరేకంగా వెళ్లిన వచ్చిన ప్రయోజనం లేదు. ఈ కారణంతోనే ఏపీ ప్రజల సెంటిమెంటును గౌరవించడం ద్వారా.. తెలంగాణలో తమ రాజకీయ పట్టును కాపాడుకోవాలనేది గులాబీ దళం వ్యూహం.
కేవలం ఆ భయంతోనే..
ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబును బూచిగా చూపి రాజకీయాలు చేశారు కేసీఆర్. అయితే కెసిఆర్ వ్యూహాన్ని గుర్తించిన చంద్రబాబు అనూహ్యంగా తెలంగాణలో తన పార్టీని పోటీలో లేకుండా చేశారు. తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను నిలిపివేశారు. అయితే టిడిపికి నాయకులు లేరు కానీ కేడర్ ఉంది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయింది. పైగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆ అరెస్టుతో తెలంగాణలో సెటిలర్స్ ఆగ్రహంతో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ వ్యతిరేకిస్తే ఆ ప్రభావం ఉంటుందని కేసీఆర్ కు తెలుసు. అందుకే అమరావతికి మద్దతుగా గులాబీ పార్టీ ఎంపీలు రాజ్యసభలో గళం ఎత్తారు.
