HomeజాతీయంEnd of Naxalism: నక్సలిజానికి అంతం ఉందా?!

End of Naxalism: నక్సలిజానికి అంతం ఉందా?!

* కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక ప్రకటన

* సాయుధ పోరాటం ముగిసిన అధ్యయనం

* ఇప్పుడు అంతా పౌరహక్కులపై సమరం

క్రైమ్ మిర్రర్, జనరల్ డెస్క్: నక్సలిజం.. దశాబ్దాలుగా వినిపిస్తూ వచ్చిన మాట ఇది. భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాల్ గా నిలిచింది. అటువంటి నక్సలిజం అంతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్న ఆయన తన లక్ష్యం పూర్తి చేసినట్లుగా ప్రకటించారు. అయితే దీనిని ఒక చారిత్రక పరిణామం గా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పాటు ఎర్రని జెండా నీడన సాగిన సాయుధ పోరాటం వేలాదిమంది ప్రాణాలను బలిగొని రక్తపాతం సాగించింది. అటువంటి ఉద్యమానికి ఇప్పుడు బ్రేక్ పడింది. అయితే అంతమయ్యింది నక్సలైట్లు మాత్రమే.. నక్సలిజం మాత్రం ఎన్నటికీ సజీవం.. ఇది ఒకరు చెప్పిన మాట కాదు. చరిత్ర చెప్పిన మాట.

దశాబ్దాల చరిత్ర

భారతదేశంలో నక్సలిజానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు దేశంలోని 10 రాష్ట్రాలకు పైగా గజ గజ లాడించిన నక్సల్స్ ఇప్పుడు కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యారు. గణపతి వంటి అగ్రశ్రేణి నాయకులు రికార్డుల్లో ఉన్నారు. కానీ వృద్ధాప్యంలో ఉన్నారు. అడవుల్లో తిరిగేందుకు, దాడులు చేసేందుకు అవసరమైన శారీరక శక్తి వారిలో సన్నగిల్లింది. ప్రాణాలను కాపాడుకోవడానికి దాక్కోవడమే ఇప్పుడు సవాల్ గా మారింది వారికి. కొత్తగా నియామకాలు లేకపోవడం, టెక్నాలజీ పెరగడం, నిఘా వ్యవస్థలు పటిష్టం కావడంతో.. నక్సలిజం రాను రాను తగ్గుతూ వచ్చింది. తుపాకీ గొట్టం ద్వారా అధికారం వస్తుందని మొండి వాదన ఆచరణలో సాధ్యం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమిత్ షా చేసిన ప్రకటన భౌతిక విజయానికి సంకేతం.

సాయుధ విప్లవం..

సాయుధ విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని పీడిత, బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నది ఒక లక్ష్యం. రాజ్యపాలన కూలదోసి అధికారాన్ని చేతికించుకోవాలని నక్సలైట్ల ప్రాథమిక సిద్ధాంతం కాలగర్భంలో కలిసిపోయింది. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్న మనదేశంలో.. సాయుధ పోరాటానికి ప్రజా మద్దతు మాత్రం లేకుండా పోవడం గమనార్హం. అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాలకు చేరుతుండడం, రహదారులు, విద్యుత్, ఇంటర్నెట్ వంటివి అడవి బిడ్డలకు చేరడం సాయుధ పోరాటం తన ఉనికిని కోల్పోయింది. హింసా మార్గం ద్వారా మార్పును ఆశించడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు అని నేటి తరానికి తెలిసింది. అందుకే ఉద్యమం వైపు వెళ్లేవారు తక్కువ అయ్యారు.

సామాజిక అన్యాయం నుంచి..

ప్రస్తుతం అంతమైంది నక్సలైట్లా? నక్సలిజమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నక్సల్స్ సిద్ధాంతం పుట్టడానికి ప్రధాన కారణం సామాజిక అన్యాయం. నిస్సహాయుల కోసం అండగా ఉండాలి. పీడిత వర్గాలకు న్యాయం జరగాలి. అడవి, నీరు, భూమిపై స్థానికులకే హక్కు ఉండాలనే భావజాలం ఎప్పటికీ సజీవమే. నక్సలిజం ప్రారంభంలో ఉన్న ఈ మూల సిద్ధాంతాలు నేరం కాదు. ఆకలి ఉన్నంతకాలం, అన్యాయం జరుగుతున్నంత కాలం.. ఎక్కడో ఒక చోట గొంతుకలు లేస్తూనే ఉంటాయి. అయితే అవి తుపాకీ గొట్టాన్ని ఎంచుకోవడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వ్యక్తమవుతున్నాయి. నక్సలిజం తన రూపాన్ని మార్చుకుంది. అడవి నుంచి ఇప్పుడు అహింసాయుత ఆందోళనలవైపు వెళ్ళింది. చట్టపరమైన పోరాటాలు, పౌర సమాజ ఉద్యమాలు, రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రం ద్వారా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది నిజంగా శుభపరిణామం. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. సాయుధ నక్సలిజాన్ని తుదముట్టించారు. కానీ ఆ సిద్ధాంతం వెనుక ఉన్న మూల కారణాలను కూడా పరిష్కరిస్తేనే నిజమైన విజయం దక్కుతుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments