భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రముఖ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరో కీలక అడుగు వేసింది. సంస్థ తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్‌ను మరింత శక్తివంతమైన రూపంలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యంతో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ అధిక రేంజ్ సామర్థ్యం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణ అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం 2025 ఫిబ్రవరిలో 23,581 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, 2026 ఫిబ్రవరిలో 38,054 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే 14,473 అదనపు యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. మొత్తంగా 61.38 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్రస్థానాన్ని ఈ మోడల్ దక్కించుకుంది.
దేశవ్యాప్తంగా టాప్ 10 స్కూటర్ల జాబితాను పరిశీలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ముందున్న మూడు స్థానాల్లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి పెట్రోల్ స్కూటర్లు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ విభాగంలో మాత్రం ఐక్యూబ్ గట్టి పోటీ ఇస్తోంది. ఇది రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని సూచిస్తున్న సంకేతంగా భావిస్తున్నారు.
ఈ స్కూటర్ ప్రస్తుతం 3 ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రాథమిక వేరియంట్‌లో 2.2 కిలోవాట్ నుంచి 3.5 కిలోవాట్ వరకు బ్యాటరీ ఎంపికలు లభిస్తాయి. వీటి ద్వారా 94 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. మధ్యస్థ వేరియంట్ అయిన ఐక్యూబ్ ఎస్ 145 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుండగా, అత్యాధునిక వేరియంట్ ఐక్యూబ్ ఎస్టీ 5.3 కిలోవాట్ బ్యాటరీతో 212 కిలోమీటర్ల గరిష్ట రేంజ్‌ను అందిస్తుంది.
ధరల విషయానికి వస్తే, ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.08 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే ప్రత్యేక సదుపాయంగా బ్యాటరీ సేవ వేరుగా తీసుకునే విధానంలో ఇది రూ.59,999కే అందుబాటులో ఉంటుంది. ఈ విధానంలో వినియోగదారులు నెలకు రూ.1,202 చెల్లిస్తూ బ్యాటరీ సేవను వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ఆఫర్లు, అధిక రేంజ్, మెరుగైన ఫీచర్లతో ఈ మోడల్ వినియోగదారులలో మరింత ఆదరణ పొందుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో టీవీఎస్ మోటార్స్ తీసుకొచ్చిన ఈ సరికొత్త మార్పులు భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగాన్ని మరింతగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ హిత వాహనాలపై అవగాహన పెరుగుతున్న తరుణంలో ఇలాంటి మోడల్స్ మార్కెట్‌ను కొత్త దిశలో నడిపిస్తున్నాయి.
Note: అయిదే ఇది ఒక్క ఛార్జ్‌లో 212 వస్తుందని కంపెనీ చెబుతున్నప్పటికీ రియల్ టైమ్‌లో ఇది తగ్గవచ్చు. రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల కారణంగా దీనిలో మార్పులు రావచ్చు. కొనే ముందు వినియోగదారులు ఇది గమనించాలి.
ALSO READ: డెలాయిట్ నుంచి శుభవార్త.. ఉద్యోగాలపై భయం అవసరం లేదు!
