Homeజాతీయం1.40 లక్షల మందికి రేషన్ కార్డులు కట్!

1.40 లక్షల మందికి రేషన్ కార్డులు కట్!

రేషన్ కార్డుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను వేగవంతం చేసింది. అర్హత లేకపోయినా అక్రమ మార్గాల్లో రేషన్ కార్డులు పొందుతున్న వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల పునఃపరిశీలన చేపట్టి అనర్హులను తొలగించడం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. అనర్హులను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా 102 రేషన్ కార్డులను రద్దు చేశారు.

పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ సహాయమంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 41 లక్షలకుపైగా అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు ఆమె వెల్లడించారు. ఈ చర్యలతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిందని తెలిపారు. దేశంలో 5.51 లక్షల రేషన్ దుకాణాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో సరుకుల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు. వివిధ శాఖల సమాచారాన్ని సమన్వయం చేస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు.

జీఎస్టీ, కార్పొరేట్ వ్యవహారాలు, జాతీయ రహదారులు, ఆదాయ పన్ను శాఖల నుంచి అందిన డేటా ఆధారంగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే రాజస్థాన్‌లో అత్యధికంగా 6 లక్షలకుపైగా కార్డులను తొలగించినట్లు వెల్లడించారు. అయితే ప్రజా పంపిణీ డేటాను ఇతర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్రం పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత 15 లక్షలకుపైగా కొత్త కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,348 రేషన్ దుకాణాల ద్వారా సుమారు 1.05 కోట్ల మందికి సరుకుల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 99,36,073 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా, 5,66,660 అంత్యోదయ అన్న యోజన కార్డులు, 5146 అన్నపూర్ణ కార్డులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రేషన్ కార్డుల సంఖ్య అధికంగా ఉంది. హైదరాబాద్ నగరంలో 8.39 లక్షల కార్డులు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 6.53 లక్షలు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 6.41 లక్షలు ఉన్నాయి. మరోవైపు ములుగు జిల్లాలో అత్యల్పంగా 1.02 లక్షల కార్డులు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా రేషన్ సరఫరాలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ నెలలోనే మూడు నెలల కోటాను ఒకేసారి అందించేందుకు నిర్ణయించింది. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనుంది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ చర్యలతో నిజమైన అర్హులకు సరైన సమయంలో, సరైన లబ్ధి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు పేర్కొంటున్నారు.

ALSO READ: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. స్టార్ హీరోలు మనసుపడ్డ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments