•దున్నేవాడిదే భూమి.. ఉన్నవాడిదే ఇల్లు
క్షేత్రస్థాయిలో ఆర్డీవో నిర్ధారణ!
•వారసత్వం పేరుతో వస్తే కుదరదు.. సాగులో ఉన్న భూమికే రిజిస్ట్రేషన్!
•మర్రిగూడ బాధితులకు అండగా నిలిచిన రెవెన్యూ యంత్రాంగం.. ఆర్డీవో శ్రీదేవి కీలక ఆదేశాలు.!
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- దశాబ్దాల కాలంగా గూడు కట్టుకుని, పన్నులు కడుతూ, కష్టార్జితంతో భూమిని నమ్ముకున్న సామాన్యుల పక్షాన న్యాయం నిలబడిందనే చెప్పుకోవాలి. మర్రిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 5లో నెలకొన్న భూ తగాదాపై, చండూర్ ఆర్డీవో శ్రీదేవి మంగళవారం చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ, బాధితుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. కాగితాల మీద లెక్కలు కాదు.. కళ్లముందున్న వాస్తవాలే ముఖ్యం అన్నట్లుగా, సాగిన ఈ విచారణతో వివాదానికి ఒక స్పష్టత లభించింది.
సామాన్యుడి శ్రమపై ‘ధరణి’ నీడ!
స్థానికుల కన్నీటి గాథ ప్రకారం.. దశాబ్దాల క్రితమే సర్వే నంబర్ 5లోని భూమిని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన బాధితులు, అక్కడ ఇళ్లను, విద్యాసంస్థలను నిర్మించుకున్నారు. గ్రామ పంచాయతీ రికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకుని, క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అయితే, 2018లో ‘ధరణి’ పోర్టల్ అమలులోకి వచ్చిన సమయంలో, జరిగిన కొన్ని సాంకేతిక మార్పుల వల్ల, గతంలోనే భూమిని విక్రయించిన వ్యక్తుల వారసులకు పట్టా పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి.అభివృద్ధి చెందుతున్న మర్రిగూడలో భూముల ధరలు పెరగడంతో, ఈ పాస్ పుస్తకాలను ఆసరాగా చేసుకుని, కొంతమంది తామే వారసులమంటూ రంగ ప్రవేశం చేశారు. అమాయక ప్రజలు కట్టుకున్న ఇళ్లను సైతం తమవేనని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ప్రయత్నించడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
అధికారుల సమయస్ఫూర్తి – నిలిచిన రిజిస్ట్రేషన్
ఈ అక్రమ ప్రయత్నాలపై బాధితులు ఐక్యంగా పోరాడి అధికారులను నిలదీశారు. వాస్తవాలను గ్రహించిన మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, పరిస్థితి తీవ్రతను గుర్తించి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేశారు. పూర్తి స్థాయి నివేదికను ఆర్డీవోకు సమర్పించగా, మంగళవారం ఆర్డీవో శ్రీదేవి స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు.
క్షేత్రస్థాయిలో తేలిపోయిన ‘వారసుల’ వాదన!
ఆర్డీవో విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పట్టా పుస్తకాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వారు, క్షేత్రస్థాయిలో తమ స్వాధీనంలో ఉన్న సరైన భూమిని చూపించలేకపోయారు. అక్కడ ఇళ్లు, పలు కట్టడాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. కేవలం పాస్ పుస్తకాలు ఉన్నంత మాత్రాన, ఇతరుల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, మీకు నిజంగా భూమి ఉంటే అది ఎక్కడ ఉందో చూపించండి.. సాగు చేసుకోండి. అంతవరకు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోండని, ప్రజా అభ్యర్థనలను గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు. డిఐఓ ద్వారా సమగ్ర సర్వే చేయించి, ఎంత భూమి సాగులో ఉన్నది, ఎక్కడ ఇళ్లు ఉన్నాయి అనే నివేదిక వచ్చిన తర్వాతే, ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
తప్పుడు పట్టాలను రద్దు చేయండి
శాంతిభద్రతల దృష్ట్యా ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య ఈ విచారణ సాగింది. ఈ సందర్భంగా బాధితులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము కష్టపడి కొనుక్కున్న భూమి ఇది.. ఇక్కడ సాగు భూమి లేదని అగ్రికల్చర్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని, రైతుబంధు కూడా ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇంకా పట్టాల పేరుతో మమ్మల్ని వేధించడం ధర్మమా? అని ప్రశ్నించారు. తప్పుడు పట్టాలను వెంటనే రద్దు చేసి, తమ ఇళ్లకు రక్షణ కల్పించాలని అధికారులను వారు కోరారు.
అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడం హర్షణీయం
అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు లేకుండా ఆర్డీవో తీసుకున్న నిర్ణయం, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చింది.! ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపి, బాధితులకు న్యాయం చేయాలని మర్రిగూడ ప్రజలు కోరుతున్నారు.
