ఆకాశం ఒక్కసారిగా రక్తవర్ణంలోకి మారిపోవడం పశ్చిమ ఆస్ట్రేలియాలో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎప్పుడూ చూడని విధంగా ఉదయం ఆకాశమంతా ఎర్రటి రంగులో మునిగిపోవడంతో స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. అచ్చం సినిమా సన్నివేశంలా కనిపించిన ఈ వాతావరణ మార్పు ప్రళయం సూచనలా ఉందేమో అన్న అనుమానాలను రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వేగంగా వ్యాపించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ప్రత్యేకంగా షార్క్ బే, డెన్హామ్ ప్రాంతాల్లో ఉదయం నిద్రలేచిన ప్రజలకు ఈ దృశ్యం ఒక భయంకర అనుభూతిని కలిగించింది. ఎటు చూసినా ఎర్రటి కాంతి పరచుకుని ఉండటంతో ఇళ్లు, రోడ్లు, వాహనాలు, సముద్ర తీర ప్రాంతాలు అన్నీ ఒకే రంగులో కనిపించాయి. శనివారం ఉదయం సాధారణంగా సూర్యుడు ఉదయించినప్పటికీ కొద్దిసేపటికే వెలుగు తగ్గిపోయి ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోవడంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఈ దృశ్యం చూసిన చాలా మంది ప్రపంచం అంతమవుతోందేమో అన్న భావనతో భయపడిపోయారు. సోషల్ మీడియాలో ప్రళయం రాబోతుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో మరింత ఆందోళన నెలకొంది. కొంతమంది బయటకు వచ్చి ఈ వింత దృశ్యాన్ని చూస్తుండగా, మరికొందరు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.
అయితే ఈ సంఘటన వెనుక సహజసిద్ధమైన కారణాలే ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. మార్చి 27న ఉష్ణమండల తుఫాను నరెల్లే ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో ఎడారి ప్రాంతాల్లో ఉన్న ఇనుము సమృద్ధిగా ఉన్న ఎర్రటి మట్టి గాలిలోకి ఎగిరి మేఘాల్లా వ్యాపించింది. ఆ తరువాత ఉదయపు సూర్యకిరణాలు ఈ సూక్ష్మ ధూళి కణాలపై పడడంతో ఆకాశం మొత్తం రక్తవర్ణంలోకి మారిపోయింది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజమైనదేనని, ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. కొందరు దీనిని అపశకునంగా భావించగా, మరికొందరు పెద్ద విపత్తు సంభవించబోతుందంటూ భయాందోళనలకు గురయ్యారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించినప్పటికీ, చాలా మంది భయంతో ఇళ్లలోనే ఉండిపోయినట్లు సమాచారం.
ALSO READ: 50 సంవత్సరాల తర్వాత చంద్రుడి వైపు మానవ యాత్ర
