అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు NASA సిద్ధమైంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి పరిధిలోకి పంపించే లక్ష్యంతో ‘ఆర్టెమిస్ II’ మిషన్‌ను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. Artemis II పేరిట జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న కెనెడీ స్పేస్ సెంటర్‌లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. ప్రయోగానికి ముందు ట్యాంకింగ్ ఆపరేషన్స్‌లో భాగంగా రాకెట్‌లో ఇంధనం నింపే ప్రక్రియను అదే రోజు సాయంత్రం 6:15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న ప్రయోగం సాధ్యం కాకపోతే, ఏప్రిల్ 6 వరకు లేదా చివరి అవకాశంగా ఏప్రిల్ 30న ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది.
ఈ మిషన్‌లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. రీడ్ విలియమ్స్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, విక్టర్ గ్లోవర్ పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే క్రిస్టినా కొచ్ మిషన్ స్పెషలిస్టుగా, జెరెమీ హాన్సెన్ సభ్యుడిగా పాల్గొంటున్నారు. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ క్రాఫ్ట్ మొదట లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశించి, దాదాపు 24 గంటల తర్వాత ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ మిషన్‌లో అత్యంత కీలక ఘట్టం ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ ఫ్లైబై చేయడం. ఈ సమయంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 11:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒక గంటలోపే ఈ వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మనుషులుగా కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న అపోలో-13 రికార్డును అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 7న ఈ మిషన్‌లోని వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర సిబ్బందితో ఆడియో సంభాషణ నిర్వహించనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9న అంతరిక్షం నుంచే మీడియాతో మాట్లాడే కార్యక్రమం ఉండగా, ఏప్రిల్ 10న ఈ మిషన్ ముగియనుంది. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో స్ప్లాష్ డౌన్ జరగనుంది. ఆ తరువాత అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక నౌక ద్వారా వ్యోమగాములు, స్పేస్ క్రాఫ్ట్‌ను సురక్షితంగా భూమికి తీసుకువస్తారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు కీలక దశగా భావిస్తున్నారు.
ALSO READ: వేడెక్కిన తమిళనాడు ఎన్నికల పోరు.. నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్
