Jaishankar On Pak: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను ‘దళారీ దేశం’గా ఆయన అభివర్ణించినట్లు సమాచారం.
పాక్ లా భారత్ దళారీ దేశం కాదు!
ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పటికే నాలుగో వారానికి చేరుకుంది. ఈ పరిస్థితిలో యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం చేయడానికి పాకిస్థాన్ ముందుకు రావడం చర్చకు వచ్చింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలకు తాము వేదికగా నిలుస్తామని పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై స్పందించిన జైశంకర్, పాకిస్థాన్ తరహాలో భారత్ వ్యవహరించదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. భారత్ ఎప్పుడూ ఇతర దేశాల మధ్య ‘దళారీ’గా వ్యవహరించదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
విపక్షాల ప్రశ్నలకు జైశంకర్ సమాధానం
ఈ విషయంపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో భారత్ ఎందుకు మౌనంగా ఉందని అడిగాయి. దీనికి సమాధానంగా జైశంకర్, భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని, అనవసరంగా మధ్యవర్తిత్వం చేయడం కంటే బాధ్యతాయుతంగా వ్యవహరించడం ముఖ్యం అని వివరించారు. ఈ వ్యాఖ్యలు భారత్ విదేశాంగ విధానంపై మరోసారి చర్చకు దారి తీశాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాల మధ్య భారత్ తన స్వతంత్ర విధానాన్ని కొనసాగిస్తోందని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.
