Sunday, March 22, 2026
Homeతెలంగాణరేవంత్ కోర్టులో జీవన్ రెడ్డి బంతి!

రేవంత్ కోర్టులో జీవన్ రెడ్డి బంతి!

•కాంగ్రెస్ దూతల విస్తృత చర్చలు
•ఆ ఒక్కటి పై పట్టుబడుతున్న అసంతృప్త నేత

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మెత్తబడతారా? ఆ ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ దూతలతో ఆయన ఏం చెప్పారు? కాంగ్రెస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది? జీవన్ రెడ్డికి భరోసా ఇస్తుందా? లేకుంటే వదులుకునేందుకు సిద్ధపడుతుందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డిని వదులుకోకూడదని భావిస్తే మాత్రం పరిణామాలు ఇంకోలా ఉంటాయి. వదులుకోవాలని సిద్ధపడితే మాత్రం ఆయనను పట్టించుకునే ఛాన్స్ ఉండదు. కానీ మంత్రి శ్రీధర్ బాబు లాంటి వారిని పంపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఇంకా పార్టీలోనే కొనసాగించాలని భావిస్తోంది. అయితే జీవన్ రెడ్డి కోరికను మాత్రం మన్నిస్తేనే ఆయన పార్టీలో కొనసాగుతారు. అంటే గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ను వదులుకుంటారా? ఆయన కంటే జీవన్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తారా? అన్నది చూడాలి.

చంద్రబాబు మాదిరిగానే..
రాజకీయంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు. అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబు మాదిరిగానే వ్యూహాలు రచించగలడు. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ శైలి అలానే ఉంది. ఎవరైనా టిడిపి నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉంటే చంద్రబాబు తన దూతలను పంపిస్తారు. సమగ్రంగా వివరాలు సేకరిస్తారు. అవతలి వ్యక్తి డిమాండ్లు బాగుంటే అందుకు సహేతుకమైన కారణాలతో ముందుకు వెళ్తారు. వీలైనంతవరకు పార్టీలోనే కొనసాగించేలా చూస్తారు. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి అనుసరించిన తీరు కూడా అదే. చివరి వరకు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో కొనసాగేలా ప్రయత్నాలు జరుగుతాయి. అవి శృతి మించి జీవన్ రెడ్డి వెళ్లి పోతే మాత్రం ఆ తప్పు తన పై పడకుండా చూసుకుంటారు రేవంత్. చంద్రబాబు ఫార్ములా కూడా అదే.

అప్పట్లో కేశినేని విషయంలో..
2024 సార్వత్రిక ఎన్నికల కు ముందు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇదే మాదిరిగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు తరుపున కొంతమంది నేతలు మధ్యవర్తిత్వం వహించారు. చంద్రబాబు ఒకరిద్దరూ నేతలను పంపించి కేసినేని నానితో మాట్లాడించారు. అయితే చంద్రబాబు ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకుంటారు. వెళ్లిపోయే వారికి ఎటువంటి హామీలు ఇవ్వరు. తన మాటగా మాత్రమే చెప్పాలని చెబుతారు. అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో కూడా రేవంత్ అలానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. కేవలం జీవన్ రెడ్డి అభిప్రాయాన్ని మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.

ప్రాధాన్యం ఇవ్వాలని..
గులాబీ పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో చాలామంది ఎమ్మెల్యేలను ఆకర్షించింది కాంగ్రెస్ పార్టీ. అలా జీవన్ రెడ్డి పై గెలిచిన సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకుంది. ఆయనకు ప్రాధాన్యమిస్తోంది. అయితే నాపై గెలవవచ్చు కానీ.. అంతకుముందు గెలిచిన వ్యక్తిని నేను అంటూ జీవన్ రెడ్డి వాదిస్తున్నారు. నా ప్రమేయం లేకుండా పార్టీలో తీసుకోవడమే కాదు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీ దూతల వద్ద కూడా అదే ప్రస్తావన చేశారు. తనకు ప్రాధాన్యం ఇస్తేనే అంటూ నిబంధన విధించారు. దానికి కట్టుబడి ఉంటేనే కాంగ్రెస్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బంతి కాంగ్రెస్ హై కమాండ్ కోర్టులో ఉంది. అన్నింటికీ మించి సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో ఉంది. ఆయన తీసుకునే నిర్ణయం మేరకు మాత్రమే జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా? గులాబీ పార్టీలో చేరుతారా అనేది తేలనుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments