HomeతెలంగాణTelangana Govt: ప్రజలందరికీ బీమా, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Govt: ప్రజలందరికీ బీమా, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

* రేషన కార్డు ఉన్న 1.15 కుటుంబాలకు ఇన్సూరెన్స్

* కుటుంబ పెద్ద ఎలా మరణించినా రూ.5 లక్షల పరిహారం

* ఇందిరమ్మ జీవిత బీమా పేరిట ప్రభుత్వం కొత్త పథకం

* ఇంటర్‌ విద్యార్థులకూ ఇక అల్పాహారం, మధ్యాహ్న భోజనం

* ప్రభుత్వోద్యోగులకు ఆరోగ్య పథకం.. రూ.1.2 కోట్ల ప్రమాద బీమా

* చేయూత పథకం కింద మరో రెండు లక్షల పింఛన్లు

* బడ్జెట్లో కొత్త పథకాలను ప్రకటించిన రేవంత్ సర్కారు

* రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర 2026-27 సంవత్సర బడ్జెట్‌

క్రైం మిర్రర్: హైదరాబాద్: ఏ కుటుంబ పెద్ద అయినా అకాల మరణం చెందితే.. ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది! ఆర్థిక ఆసరా లేని పేద, మధ్య తరగతి కుటుంబాలైతే రోడ్డునపడతాయి! రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది! దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన 2 నుంచి దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలో రేషన కార్డులు కలిగిన 1.15 కోట్ల కుటుంబాలకూ ఈ పథకం వర్తించనుంది. దీంతోపాటు పలు కొత్త పథకాలను 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. రూ.3,24,234 కోట్లతో భారీ బడ్జెట్ ను ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రవేశపెట్టారు.

పథకాలకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలతోపాటు పాత, కొత్త పథకాలన్నింటికీ కలిపి ఈసారి ఏకంగా రూ.1,45,591 కోట్లను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటికి కేవలం రూ.1,04,329 కోట్లను మాత్రమే కేటాయించగా.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.41,262 కోట్లను అదనంగా కేటాయించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. దీనికి రూ.19,269 కోట్లను పెంచి రూ.3,24,234 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు కాగా; మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే… పాత బడ్జెట్‌ కంటే కొత్త బడ్జెట్‌ 6.31 శాతం ఎక్కువ. బడ్జెట్లో సాగు, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ రెండు రంగాలకే మొత్తం బడ్జెట్లో 26.66 శాతం నిధులు కేటాయించారు. ఇందులో వ్యవసాయం, సహకారం, పశు సంవర్థక, మత్య్స, సాగునీటిపారుదల వంటి రైతు సంబంధిత శాఖలకు 14.59 శాతం నిధులు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమానికి 12.07 శాతం నిధులు కేటాయించారు. రైతు సంబంధిత శాఖలకు రూ.47,323 కోట్లు కోటాయించారు.

విద్యకు అత్యంత ప్రాధాన్యం..

విద్యా శాఖకు బడ్జెట్లో ఏకంగా రూ.26,674 కోట్లు కేటాయించారు. అనేక కొత్త పథకాలను ప్రకటించారు. ఇప్పటి వరకూ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం మాత్రమే అందుబాటులో ఉండగా..  ఇకనుంచి, ఈ పథకాన్ని ఇంటర్మీడియట్‌ వరకూ విస్తరించనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దాదాపు 23,51,000 మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రకటించారు. అలాగే, ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.2 కోట్ల బీమా వర్తించనుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల కవరేజీ వర్తిస్తుంది. ఈ పథకం, 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తించనుంది. తాజా బడ్జెట్‌లో కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత పింఛన్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.14,861 కోట్లనే తాజా బడ్జెట్‌లోనూ కేటాయించింది.

ఆరు గ్యారెంటీలకు తగ్గిన నిధులు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఈసారి నిధులను తగ్గించడం గమనార్హం. రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహలక్ష్మి, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.56,024 కోట్లను కేటాయించింది. కానీ.. తాజా బడ్జెట్‌లో రూ.5,371 కోట్లను తగ్గించి, రూ.50,713 కోట్లను కేటాయించింది. ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికే నిధులు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.5,500 కోట్లతోనే సరిపెట్టింది. ఇక్కడ రూ.7,071 కోట్లకు కోత పెట్టింది. అయితే.. ఇప్పటి వరకూ సన్న వడ్లకే బోనస్‌ ఇస్తున్న ప్రభుత్వం.. ఇకనుంచి పంటలకు బోనస్‌ ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది. సన్న వడ్లకు బోనస్‌ కింద రూ.1800 కోట్లుగా ఉన్న కేటాయింపులను రూ.3,500 కోట్లకు పెంచింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు