* పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం
* ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
* సమస్యను శాంతియుతంగా చర్చించుకోవాలని సూచన
PM Modi Speaks to Iran President Pezeshkian: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజల ప్రాణ నష్టం, పౌర మౌలిక వసతుల ధ్వంసంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా వెల్లడి!
ఇరాన్ ప్రధానితో మాట్లాడిని విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రాంతీయ పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించినట్లు తెలిపారు. యుద్ధం కారణంగా పౌరుల ప్రాణ నష్టం జరుగుతుండటం, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అలాగే ఈ పరిస్థితుల్లో భారతీయుల భద్రత, దేశానికి అవసరమైన వస్తువుల సరఫరా, నిరంతర ఇంధన సరఫరా వంటి అంశాలు భారత్‌కు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన చర్యలు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
14వ రోజుకు చేరిన యుద్ధం
ఇదిలా ఉండగా, ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటితో 14వ రోజుకు చేరింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గత పది రోజులుగా మోదీ పశ్చిమాసియా దేశాల పలువురు నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన సమయంలోనే మోదీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో మాట్లాడారు.
