Thursday, March 12, 2026
HomeజాతీయంSupreme Court: అతడిని చనిపోనివ్వండి, సంచలన తీర్పు చెప్పిన అత్యున్నత న్యాయస్థానం!

Supreme Court: అతడిని చనిపోనివ్వండి, సంచలన తీర్పు చెప్పిన అత్యున్నత న్యాయస్థానం!

* 13 సంవత్సరాలుగా కోమాలో యువకుడు

* కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన హరీశ్ రాణా (32) చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్టు 20న హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో అతడికి తీవ్ర తలకు గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత హరీశ్ పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడు స్పృహలోకి రాకుండా చికిత్స పొందుతూనే ఉన్నాడు.

2024లో న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన పేరెంట్స్

ప్రముఖ ఆస్పత్రుల్లో ఎన్నో సంవత్సరాలు చికిత్స అందించినప్పటికీ అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. శరీరం కదలలేని స్థితిలో జీవచ్ఛవంలా మారిపోయిన అతడిని తల్లిదండ్రులే ఇన్నేళ్లు చూసుకుంటూ వచ్చారు. దీర్ఘకాలిక చికిత్స వల్ల కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఈ పరిస్థితుల్లో హరీశ్ తల్లిదండ్రులు 2024 జూలైలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వారు కోర్టును కోరారు. అయితే హరీశ్ వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదని, కేవలం శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం కోసం గాస్ట్రోస్టమీ ట్యూబ్ ఉపయోగిస్తున్నాడని హైకోర్టు పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే అది యాక్టివ్ యూతనేషియాగా పరిగణించబడుతుందని చెబుతూ పిటిషన్‌ను తిరస్కరించింది.

సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

దీంతో హరీశ్ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైద్యులు అతడు కోలుకునే అవకాశం చాలా తక్కువ అని స్పష్టమైన నివేదికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. ఈ ఏడాది జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో న్యాయమూర్తులు మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయ కోణంలో తమ కుమారుడికి గౌరవప్రదమైన మరణాన్ని అనుమతించాలని వారు కోర్టును వేడుకున్నారు.ఈ కేసుపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న హరీశ్ రాణాకు పాసివ్ యూతనేషియాకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీశ్ రాణాకు పాసివ్ యూతనేషియా ప్రక్రియ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. 2018లో సుప్రీంకోర్టు పాసివ్ యూతనేషియాను చట్టబద్ధం చేసిన తర్వాత దేశంలో ఈ విధంగా అమలు చేయబడుతున్న తొలి కేసుగా గుర్తింపు తెచ్చుకుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments