HomeజాతీయంLPG Shortage: అయోధ్య రామయ్యకు LPG ఎఫెక్ట్, ఆలయ అధికారుల కీలక నిర్ణయం!

LPG Shortage: అయోధ్య రామయ్యకు LPG ఎఫెక్ట్, ఆలయ అధికారుల కీలక నిర్ణయం!

* ఆలయాలపై LPG కొరత ఎఫెక్ట్

* అయోధ్య రామ్ రసోయిపై ప్రభావం

* వంటల తయారీలో కీలక మార్పులు

దేశంలో వంట గ్యాస్‌ కొరత ప్రభావం ఇప్పుడు ఆలయాల పాకశాలలపైనా కనిపిస్తోంది. ముఖ్యంగా అయోధ్యలో భక్తులకు ఉచిత భోజనం అందించే “రామ్‌ రసోయి”పై కూడా ఈ సమస్య ప్రభావం చూపింది. రోజూ వేలాది మంది భక్తులు అక్కడ ప్రసాదంగా ఇచ్చే భోజనాన్ని ఆరగిస్తుంటారు. సాధారణంగా ప్రతిరోజూ 10 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులకు అక్కడ అన్నదానం నిర్వహిస్తారు. అయితే ఎల్పీజీ కొరత కారణంగా తాత్కాలికంగా వంట ఏర్పాట్లలో మార్పులు చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. రామ్‌ రసోయిని పూర్తిగా మూసివేయడం లేదని, ఉదయం ప్రసాద వితరణ కొనసాగుతుందని కానీ సాయంత్రం భోజన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తామని వెల్లడించారు.

సంప్రదాయా పద్దతుల్లో వంటలపై ఆలోచన

గ్యాస్‌ సరఫరా సమస్య కొనసాగితే బొగ్గు, కట్టెల వంటి సంప్రదాయ వనరులతో వంట చేయడం లేదా ఎలక్ట్రిక్‌ కుక్కర్లను ఉపయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఇదే సమయంలో అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయంలో లడ్డూల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో భక్తులకు అందించే ప్రసాద భోజనంలో కూడా మార్పులు చేశారు. ముందుగా రెండు కూరలు పెట్టే చోట ఇప్పుడు ఒకటే కూరతో సరిపెడుతున్నారు.

ఇతర ఆలయాలపైనా ఎఫెక్ట్

ఇక మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో రోజూ వేలాది మందికి భోజనం, అల్పాహారం అందించేందుకు భారీగా గ్యాస్‌ వినియోగిస్తారు. ప్రస్తుతం అక్కడ 15 రోజుల వరకు సరిపడ గ్యాస్‌ నిల్వ ఉందని ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. అదనంగా సౌరశక్తిని కూడా వంటకు వినియోగిస్తూ కొంత గ్యాస్‌ను ఆదా చేస్తున్నారు. కర్ణాటకలోని పలు దేవాలయాలు, మఠాల్లో కూడా గ్యాస్‌ కొరత కారణంగా ప్రసాద వితరణలో అంతరాయం ఏర్పడింది.

ఈ ప్రభావం ఆలయాలకే పరిమితం కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లపైనా పడుతోంది. గ్యాస్‌ సరఫరా సమస్య కొనసాగితే పలు హోటళ్లు మూతపడే పరిస్థితి రావచ్చని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రెస్టారెంట్‌ అసోసియేషన్లు ఇంధనాన్ని ఆదా చేసే మార్గాలను సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేశాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు