మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ వేధింపులు భరించలేకనే పురుగుల మందు తాగినట్టు బాధితుడు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం లో ఆఫీస్ సభార్డినేట్ శ్రీనివాస్ మంగళ వారం విధులకు హాజరయ్యాడు.
కొద్ది సేపటికి తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి పడిపోయాడు. పరిస్థితి ని గమనించిన ఇతర ఉద్యోగులు ఆందోళనకు గురైయ్యారు. వెంటనే శ్రీనివాస్ ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వైద్యులకు చెప్పడం వారు వచ్చి పరీక్షించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కొరకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
నా భర్త ఆత్మహత్యాయత్నానికి సురేఖ వేధింపులే కారణం…
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ పై బాధితుడు శ్రీనివాస్ తోపాటు అతని భార్య శ్రీలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీస్ లో పని చేయిస్తున్నారని, ఆకలి అని చెప్పినా పంపించడం లేదన్నారు. అడిగితే తీవ్రంగా దూషించడం తో పాటు అవమానిస్తున్నారని ఆరోపించారు.
అందుకే ఆత్మ హత్య యత్నం చేసినట్టు శ్రీనివాస్ పేర్కొన్నారు. మరో వైపు తన భర్త ను వేధించిన సురేఖ పై చర్యలు తీసుకోవాలని భార్య శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. నస్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
