గీతం వర్సిటీ భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిందే
సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్
విజయవాడ, క్రైమ్ మిర్రర్: ప్రభుత్వానికి సంబంధించిన భూములను, పేదల భూములను ఆక్రమించిన పెత్తం దారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ దురాక్రమణలకు పాల్పడిన పెత్తందార్లు, కార్పొరేట్లు, ప్రజా ప్రతినిధులపై చర్య తీసుకొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
‘ మీభూమి మా హక్కు అంటున్న చంద్రబాబు నాయుడుఆచరణలో ‘మా భూమి మా హక్కు ‘ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవసరం వున్నా లేకున్నా అభివృద్ది పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుండి వారి ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా సర్కార్ బలవంతంగా గుంజుకుంటున్నదని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నారని అన్నారు. తప్ప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.
రైతులను, కూలీలను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ? ఈ నిరంకుశ పద్ధతులకు స్వస్తి చెప్పి దురాక్రమణకు పాల్పడుతున్న బడా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా ఏమి చర్యలు తీసుకున్నారా ? అని ప్రశ్నించారు. కానీ రైతుల భూముల కోసం పోరాడుతున్న అప్పలరాజును పిడియాక్టు కింద జైలుకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది అని మండిపడ్డారు.
ఇలాంటివి చాలా ఉదారణలున్నాయని తెలిపారు. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి ఏళ్ళు గడుస్తున్నా పరిశ్రమలు పెట్టకుండా భూములను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టినవారు, పరిశ్రమలు పెట్టకుండా రియల్ ఎస్టేటుకు మళ్లించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర భూస్వాములు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా భూములు తమ స్వాధీనంలో పెట్టుకున్నారని ఆరోపించారు.
గిరిజన పేదలకు న్యాయం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నలభై యాభై సంవత్సరాలుగా దళితులు తదితర నిరుపేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను పెత్తందార్లు లాగేసుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల భూ హక్కులను గుర్తించడం లేదు అని చెప్పారు.
రొయ్యలు, చేపల చెరువులకు బినామీలుగా అసైన్డ్ భూములు మారిపోయాయన్నారు. దీర్ఘకాలంగా 22 (ఏ) కింద పేద, మధ్య తరగతి రైతుల భూములను వివాదంగా మార్చి వాటిపై అధికారుల చుట్టూ కాళ్లరిగేటట్లు తిరుగుతున్నా పరిష్కారం కావడం లేద ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు.
