Homeతెలంగాణతెలంగాణలో బీజేపీ 'రాజ్ భవన్' రాజకీయం..!

తెలంగాణలో బీజేపీ ‘రాజ్ భవన్’ రాజకీయం..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అందుకే ఏ ప్రయత్నాన్ని కూడా ఆ పార్టీ విడిచి పెట్టడం లేదు. తాజాగా తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

నిశ్శబ్దంగా ఉన్న గవర్నర్ స్థానంలోకి చురుకైన కొత్త గవర్నర్ రావడం వెనుక.. ఏదో పెద్ద సంచలనమే నమోదు కాబోతుందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ ఉండేవారు.. ఆయన పెద్దగా స్వరం వినిపించే తత్వం కాదు. అందరితో కలివిడిగా కాలం గడిపేస్తుంటే.. ఉన్నట్టుండి ఆయనను మహారాష్ట్రకు మార్చారు.

ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి శివ ప్రతాప్ శుక్లాను తీసుకువచ్చారు. అయితే ఇది సాధారణ బదిలీ కాదు. 2028 ఎన్నికల కోసం బిజెపి వేసిన భారీ స్కెచ్ అని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆరితేరిన శివ ప్రతాప్ శుక్ల రాకతో తెలంగాణ రాజ్ భవన్ మరోసారి క్రియాశీలకంగా పనిచేస్తుందన్న టాక్ వస్తోంది. తెలంగాణ రాజకీయాలతో గవర్నర్ ద్వారా ఆడుకోవాలన్నది బిజెపి ప్లాన్ గా ప్రచారం నడుస్తోంది.

గవర్నర్ నిర్ణయం కీలకం…
కచ్చితంగా రాజకీయ పార్టీ ప్రభుత్వం నడుపుతుంది. కానీ కొన్ని అంశాల్లో మాత్రం గవర్నర్ నిర్ణయం కీలకం. మొన్నటికి మొన్న అజారుద్దీన్ మంత్రిగా నామినేట్ అయ్యారు. ఆరు నెలల్లోపు ఆయనకు ఎమ్మెల్సీ సభ్యత్వం అవసరం. అయితే అందుకు సమయం దగ్గర పడుతుంది.

క్యాబినెట్ పంపిన ఫైల్ ఇప్పుడు కొత్త గవర్నర్ టేబుల్ మీద ఉంది. అయితే ఆ ఫైల్ ను ఆయన స్వీకరిస్తారా? లేకుంటే ఇది సెట్ అవ్వదు అని పక్కన పడేస్తారా? ఒకవేళ పక్కన పడేస్తే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ప్రారంభం అయినట్టే. ఒక విధంగా దాని ద్వారా బిజెపి తెలంగాణ రాజకీయాల కోసమే గవర్నర్ పోస్టును మార్చిందని అనుమానం బలపడుతుంది.

ఇప్పటివరకు సఖ్యత..
కేంద్ర బిజెపితో రేవంత్ సర్కార్ సఖ్యతగా కొనసాగింది. ఇప్పటిదాకా రాజకీయంగా విరోధం.. పాలనాపరంగా మైత్రి అని రేవంత్ సర్కార్ సాక్షిగా నడిపిస్తోంది. కానీ కొత్త గవర్నర్ రాకతో ఆ మైత్రి కూడా ఎండమావిలా మాయమవుతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తప్ప.. మిగతా రాష్ట్రాల్లో విపక్షాలు అధికారంలో ఉన్నాయి. అక్కడ గవర్నర్ వ్యవస్థతో బిజెపి ఒక గేమ్ ఆడుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో సైతం గవర్నర్ ద్వారా గేమ్ ప్రారంభించింది. మరి అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు