* ఈసారి సరైన అభ్యర్థి
* కమ్మ సామాజిక వర్గానికి నో ఛాన్స్
* బీసీ లేదా కాపు నేతకు..
క్రైమ్ మిర్రర్, విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఒకవైపు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే.. 2029 ఎన్నికల నాటికి సరైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ముఖ్యంగా కూటమికి బలమైన నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మూడు ఎన్నికలు జరిగాయి. మూడు ఎన్నికల్లోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అందులో విజయవాడ పార్లమెంటు స్థానం ఒకటి. గడిచిన మూడుసార్లు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదే సమయంలో టిడిపి నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలే గెలుస్తూ వచ్చారు. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చుతున్నట్లు సమాచారం. సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
తొలి ఎన్నికల్లో అలా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో తొలి ఎన్నికలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోనేరు రాజేంద్రప్రసాద్ ను బరిలోకి దించారు. మరోవైపు చంద్రబాబు ప్రముఖ ట్రాన్స్పోర్ట్ అధినేత కేశినేని నానిని పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో కేసినేని నాని గెలిచారు. 2019 ఎన్నికల్లో అభ్యర్థిని మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి పోట్లూరు వరప్రసాద్ను రంగంలోకి దించారు. కేశినేని నాని రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే జగన్ ప్రభంజనం వీచింది. కానీ విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో మాత్రం కేసినేని నాని గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు టిడిపి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చింది. కేసినేని నాని సోదరుడు చిన్నిని రంగంలోకి దించింది. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి చిన్ని గెలిచారు.
ముందుగానే వ్యూహం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదు. కానీ విజయవాడ పార్లమెంటు స్థానం మాత్రం ఆ పార్టీకి కొరకరాని కొయ్య. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముందుగానే వ్యూహం రూపొందించడం మొదలుపెట్టారు. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. అయితే యువనేత దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన విముఖత చూపారు. అయితే చాలామంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఎంతలో స్థానిక నేతలు కొత్త ఆలోచన జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టారు.
కాపు లేదా బీసీ నేతకు..
విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో కమ్మ సామాజిక వర్గం అధికం. ఆ సామాజిక వర్గం 90 శాతం తెలుగుదేశం పార్టీ వైపు ఉంటుంది. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించిన వర్కౌట్ కావడం లేదు. అందుకే ఈసారి కాపు లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించితే మంచి ఫలితం ఉంటుందని స్థానిక నేతలు సూచించారట. అందుకే సరైన కాపు నేత లేదా బీసీ నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఎవరు అభ్యర్థి అవుతారో..
