తెలుగు ప్రజలకు ఇవాళ కీలక ఖగోళ ఘటన దర్శనమివ్వనుంది. మధ్యాహ్నం 3:20 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుందని ఖగోళ నిపుణులు తెలిపారు. అయితే భారతదేశంలో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కాకుండా చివరి దశలో మాత్రమే కనిపించనుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సాయంత్రం 6:20 గంటల నుంచి 6:47 గంటల వరకు మాత్రమే చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. అంటే కేవలం 27 నిమిషాల సమయమే అందుబాటులో ఉండటంతో ఆసక్తి గల వారు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ గ్రహణం భారత్‌తో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాల్లోనూ కనిపించనుంది.
గ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు సంప్రదాయాల ప్రకారం మూతపడనున్నాయి. అయితే కొన్ని ప్రముఖ దేవాలయాలు మాత్రం సాధారణ దర్శనానికి తెరిచే ఉంటాయని దేవస్థాన అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటాయి. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం కూడా తెరిచే ఉంటాయి.
ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఢిల్లీలోని కల్కాజీ దేవి, బీహార్‌లోని విష్ణుపద్, రాజస్థాన్‌లోని లక్ష్మీనాథ్ టెంపుల్, ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయం కూడా గ్రహణ సమయంలో దర్శనానికి అనుమతించనున్నట్లు సమాచారం. గ్రహణ సమయాల్లో శాస్త్రోక్త నియమాలు పాటిస్తూ భక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
