Telangana: రాష్ట్ర పాలనలో పారదర్శకత, సమాన అవకాశాల దిశగా ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోందనే చర్చ పరిపాలనా వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎలాంటి పైరవీలు, లాబీయింగ్ అవసరం లేకుండా కేవలం సీనియార్టీ ప్రాతిపదికన ప్రతి ఐఏఎస్ అధికారిని జిల్లా కలెక్టర్‌గా నియమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. తాజాగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పరిపాలనా వ్యవస్థలో ప్రతిభ, అనుభవం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తాజా బదిలీల్లో 2019 బ్యాచ్‌కు చెందిన 6 మంది ఐఏఎస్ అధికారులను వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా నియమించడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతకుముందు వీరు అదనపు కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా సేవలందించారు. ఫీల్డ్ స్థాయిలో పనిచేసిన అనుభవం, జిల్లా పరిపాలనపై అవగాహనను దృష్టిలో పెట్టుకుని వారికి కలెక్టర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో తరువాతి బ్యాచ్‌లకు చెందిన ఐఏఎస్ అధికారులు కూడా త్వరలో తమకు అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. సీనియార్టీ ఆధారంగా క్రమపద్ధతిలో అవకాశాలు కల్పిస్తామన్న సంకేతాలు రావడంతో పరిపాలనా వ్యవస్థలో ఒక విధమైన స్థిరత్వం నెలకొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కలెక్టర్ హోదా ప్రతి ఐఏఎస్ అధికారి కెరీర్‌లో కీలక మైలురాయిగా భావించబడుతుంది. జిల్లా పరిపాలన మొత్తం కలెక్టర్ ఆధీనంలో ఉండటంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలు, విపత్తుల నిర్వహణ, చట్టసూక్ష్మ వ్యవహారాల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు ఈ పదవిలో ఉంటాయి. అందుకే సర్వీసులోకి వచ్చిన 2 లేదా 3 ఏళ్ల నుంచే అధికారులు కలెక్టర్‌గా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. జిల్లాకు బాస్‌గా వ్యవహరించే ఈ హోదా పరిపాలనా అనుభవాన్ని మరింత పటిష్ఠం చేస్తుందని భావిస్తారు.
అయితే గత ప్రభుత్వ కాలంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సమర్థతకన్నా పైరవీలు, లాబీయింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారని కొందరు సీనియర్ అధికారులు గత అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఎంత సమర్థంగా పనిచేసినా అవకాశాలు రాకపోవడంతో కొందరు నిరాశకు గురయ్యారని చెబుతున్నారు. 2006లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందిన బోయి విజయేంద్ర వంటి అధికారిణికి సమర్థత ఉన్నప్పటికీ కలెక్టర్ హోదా దక్కలేదని పరిపాలనా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆమెను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించడమే కాకుండా, పనితీరు ఆధారంగా ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ శాఖ కమిషనర్ బాధ్యతలు అప్పగించడం మార్పుకు నిదర్శనమని చర్చ జరుగుతోంది.
ప్రస్తుత విధానంలో ఒక జిల్లాలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు తదుపరి దశలో హెచ్ఓడీ హోదాలు ఇవ్వడం, అక్కడ కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేస్తే వివిధ శాఖలకు కార్యదర్శులుగా నియమించడం జరుగుతుందని సమాచారం. దీని ద్వారా పరిపాలనలో అనుభవానికి, ఫీల్డ్ స్థాయి అవగాహనకు ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్నారు. వ్యవస్థలో ప్రతిభావంతులకు తగిన గుర్తింపు లభిస్తే పాలనా నాణ్యత మెరుగుపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతి ఐఏఎస్ అధికారి కెరీర్ చివరలో ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ పొందాలని ఆశపడుతుంటారు. అయితే ఆ స్థాయికి చేరాలంటే ఫీల్డ్ అనుభవం ఎంతో కీలకంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారికి ప్రభుత్వ పథకాల అమలు, సంక్షోభాల నిర్వహణ, పరిపాలనా యంత్రాంగంపై పట్టు బలంగా ఉంటుంది. అలాంటి అనుభవం ఉన్నవారు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా పర్యవేక్షించగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఈ విధానం దీర్ఘకాలిక పరిపాలనా సంస్కరణలకు దారితీస్తుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.
ALSO READ: Cervical Cancer: దేశవ్యాప్తంగా ఉచిత ‘HPV’ వ్యాక్సినేషన్ ప్రారంభం
