Friday, February 27, 2026
HomeతెలంగాణTelangana: టీచర్లకు ఆటోమెటిక్‌ పదోన్నతుల రద్దును ప్రతిపాదిస్తూ సర్కార్‌ గైడ్‌లైన్స్‌

Telangana: టీచర్లకు ఆటోమెటిక్‌ పదోన్నతుల రద్దును ప్రతిపాదిస్తూ సర్కార్‌ గైడ్‌లైన్స్‌

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీసే విధంగా విద్యా కమిషన్ కీలక సిఫార్సులు చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల విధానంపై సమీక్ష నిర్వహించిన కమిషన్, ఇకపై ఉపాధ్యాయులకు ఆటోమెటిక్‌ పదోన్నతులు ఉండకూడదని స్పష్టం చేసింది. వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు కల్పించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఈ మేరకు కమిషన్ తన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది. విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండేలా సంస్కరణలు చేపట్టాలని సూచించింది. ఉపాధ్యాయుల బాధ్యత, నైపుణ్యం, బోధనా ప్రమాణాలు పెరిగేలా కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది.

ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా అంచనా వేయాలని కమిషన్ ప్రతిపాదించింది. ఆ అంచనా ఆధారంగా ఆయా ఉపాధ్యాయులకు నివేదిక అందించి, లోపాలను సరిదిద్దుకునేందుకు 2 సంవత్సరాల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ గడువులోపల కూడా పనితీరు మెరుగుపడకపోతే సేవల నుంచి తొలగించేలా మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది. పనితీరు మెరుగ్గా ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులకు ఈ నిబంధనలు వర్తించవని, ఇకపై నియమించబడే వారికి మాత్రమే అమలు చేయాలని సూచించింది.

ఉపాధ్యాయుల శిక్షణ వ్యవస్థలో కూడా మార్పులు అవసరమని కమిషన్ అభిప్రాయపడింది. బీఎడ్ కోర్సును పునర్వ్యవస్థీకరించాలని, ప్రాథమిక స్థాయికి ప్రత్యేక బీఎడ్, ఉన్నత స్థాయికి ప్రత్యేక బీఎడ్ విధానం అమలు చేయాలని సూచించింది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఎడ్ ప్రాథమిక విధానం, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ ద్వితీయ విధానం అమలు చేయాలని పేర్కొంది. ప్రాథమిక విద్యకు సంబంధించిన పాత డిప్లమో కోర్సును రద్దు చేయాలని ప్రతిపాదించింది. బీఎడ్ విద్యార్థులకు పాఠశాలల్లో 150 రోజుల బోధనాభ్యాసం తప్పనిసరి చేయాలని సూచించింది. బోధన మాధ్యమంగా ఇంగ్లీష్‌ను ప్రాధాన్యంగా ఉంచుతూ నర్సరీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఒకే విధమైన మాధ్యమాన్ని అమలు చేయాలని పేర్కొంది. త్రిభాష విధానాన్ని 1వ తరగతి నుంచే అమలు చేయాలని సూచించింది.

పూర్వ ప్రాథమిక విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలల పరిధిలోకి తీసుకురావాలని కమిషన్ అభిప్రాయపడింది. నర్సరీ, ఎల్ కేజీ, యూ కేజీ తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యా ప్రమాణాల పర్యవేక్షణ, సిబ్బంది నియామకం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాల జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మధ్యాహ్న భోజన పథక నిర్వహణలో పారదర్శకత కోసం సమగ్ర సాఫ్ట్‌వేర్ వినియోగించాలని, వంట సిబ్బందికి వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలని పేర్కొంది.

పోటీ పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు అవసరమని కమిషన్ స్పష్టం చేసింది. ప్రముఖ ప్రవేశ పరీక్షల కోచింగ్ కేంద్రాలు, వసతి గృహాలపై కఠిన నియంత్రణ కోసం చట్ట సవరణలు చేయాలని సూచించింది. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల అర్హతలు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై కఠిన పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి పోటీ పరీక్షల శిక్షణను వేరు చేయాలని సూచించింది. 12వ తరగతిలో మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని, ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని పేర్కొంది. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి ఒకే విధమైన ప్రమాణాలు అమలు చేయాలని సూచించింది. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కనిష్ఠ ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలని నివేదికలో స్పష్టం చేసింది.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. వీరికే సబ్సిడీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments