Thursday, February 26, 2026
Homeతెలంగాణసర్కారు చేతికి మెట్రో రైలు

సర్కారు చేతికి మెట్రో రైలు

ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరుగులు
మొదటి దశను స్వాధీనం చేసుకోనున్న సర్కారు
ఎల్అండ్ టీ నుంచి రూ.15 వేల కోట్లకు కొనుగోలు
రెండో దశకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకునేందుకే

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు పగ్గాలు ఇక ప్రభుత్వం చేతికి వెళ్లనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మెట్రో నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం మెట్రోలో ప్రైవేటు భాగస్వామిగా ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

హైదరాబాద్ మెట్రో తొలిదశ మూడు కారిడార్ల పరిధిలో 69 కిలోమీటర్ల మేటర్ల నడుస్తోంది. దీనిని రూ.15 వేల కోట్లతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందులో రూ.13 వేల కోట్ల అప్పులు, రూ.2 వేల కోట్ల ఈక్విటీ భాగస్వామ్యం ఉంది.

ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మెట్రో కొనుగోలుకు ఆమోదం లభించడంతో తదుపరి చర్యలకు సర్కారు సన్నద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలో మెట్రోపై ఉన్న అప్పులే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న అప్పులకు వడ్డీ రేటు అధికంగా ఉంది. ఇది సర్కారుకు అదనపు భారం కానుండడంతో దీనిని తగ్గించుకునేందుకు రుణాల రీస్ట్చక్చరింగ్ కు సిద్ధమవుతోంది.

సుమారు 20 ఏళ్ల కాలపరిమితితో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సేకరించనుంది. వాస్తవానికి తొలిదశ మెట్రో నిర్మాణ పనులను పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టారు. ప్రాజెక్టు వ్యయం రూ.15 వేల కోట్లు కాగా,అందులో సుమారు రూ.13 వేల కోట్లు రుణాలు సేకరించారు. వీటికి వడ్డీరేటు సుమారు 8 శాతం ఉండటంతో.. ఏటా వందల కోట్ల రూపాయలు కేవలం వడ్డీల చెల్లింపులకే సరిపోతున్నాయి.

రుణాలు భారంగా మారడంతో..
రుణాలు చెల్లించడం నిర్వహణ సంస్థకు భారంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకొంది. దీంతో ప్రభుత్వమే ఈబాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చింది.

అప్పులను రీ స్ట్రక్చర్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడున్న 8 శాతం వడ్డీని 6 నుంచి 6.5 శాతం వరకు తగ్గించే ప్రయత్నం, రీఫైనాన్సింగ్‌ ద్వారా ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీతో తీసుకున్న రుణాల ద్వారా చెల్లించడం, బకాయిల కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్లకు పెంచడం వంటి చర్యల ద్వారా వార్షిక రుణ చెల్లింపుల భారాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది.

పైగా, ప్రభుత్వమే అప్పుల చెల్లింపునకు నేరుగా బాధ్యత వహిస్తున్నందున తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. వడ్డీ భారాన్ని తగ్గించుకుంటే ఆర్థికంగా మెట్రో నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ప్రయాణికుల చార్జీలతోపాటు వాణిజ్య ప్రకటనలు, స్థలాల అద్దెలు, మెట్రో పరిధిలో ఉన్న 260 ఎకరాల భూముల లీజు, వేలం పాట ద్వారా ఎక్కువ మొత్తం నిధులు సమీకరించుకునే అవకాశం ఉందంటున్నారు.

• కీలక దశలో మెట్రో…

రెండో దశమెట్రో విస్తరణకు సంబంధించి రెండో దశ ప్రణాళిక కీలక దశలో ఉంది. మొత్తం 5 కారిడార్లతో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు రూ.24 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

దీంతోపాటు అదనంగా మరో 86 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా నిర్వహణ మొత్తం ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో తొలి దశ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కేంద్రం సహకరిస్తే రెండో దశ మెట్రో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారుల సమాచారం. ఇక తొలి దశ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుకు బదిలీ అయిన భూములపైనా కీలక చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన భూముల్లో కొంత మెట్రో ట్రాక్‌లకు, ట్రాన్సిట్‌ ఓరియంటెడ్‌ డెవలప్‌మెంట్‌(టీవోడీ) ప్రాజెక్టులకు, మాల్స్‌ అభివృద్ధికి కేటాయించారు.

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తరువాత వినియోగంలో లేని భూములు ప్రభుత్వానికి వచ్చినా ఇప్పటికే మాల్స్‌ నిర్మాణం చేసిన భూములు, ఇతర ప్రైవేటు ఏజెన్సీల చేతిలో ఉన్న భూములపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. వాణిజ్య ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments