నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి, ప్రభుత్వ ఖజానాకు సుమారు 43 కోట్ల మేర గండి కొట్టిన, భారీ కుంభకోణాన్ని నల్లగొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన దంపతులను, బుధవారం నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, నల్లగొండ జిల్లా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో, ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 2022-23 రబీ సీజన్‌లో జిల్లాలోని మూడు ప్రధాన రైస్ మిల్లుల ద్వారా, ఈ అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.సుమాంజలి పార్ బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అర్జాల బావి 22 కోట్ల నష్టం, వరలక్ష్మి పార్ బాయిల్డ్ మిల్ (చిట్యాల) 19.33 కోట్ల నష్టం, మనోహర ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ (మునుగోడు)1.47 కోట్ల ప్రభుత్వ నష్టం జరిగిందని వెల్లడించారు. మొత్తంగా 13,170 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని, మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా, నిందితులు ప్రైవేటుగా విక్రయించి సొమ్ము చేసుకున్నారని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని రవీంద్ర నగర్‌కు చెందిన కందుకూరి మహేందర్ (65), అతని భార్య కందుకూరి పద్మ, (57)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని దోమలపల్లి గ్రామ శివారులో పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి..1,09,000 నగదుతో పాటు,మూడు సెల్ ఫోన్లు,ఒక బెలెనో కారు, స్వాధీనం చేసుకున్నారు.
నేర విధానం
నిందితులు ప్రభుత్వంతో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకుని, ఐకేపీ, పీఏసీఎస్, కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అయితే నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా, ఆ ధాన్యాన్ని నల్లబజారులో విక్రయించి ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేశారు.
పరారీలో మరో ఐదుగురు
ఈ కేసులో ప్రధాన పాత్రధారులైన మాశెట్టి రాధా కృష్ణ, మేడమ్ కృష్ణమూర్తి, ఇడుకుళ్ళ దామోదర్, కందుకూరి రవి కుమార్, బూరుగు బాలకృష్ణ పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన డీఎస్పీ కె.శివరాం రెడ్డి, సీఐలు రాఘవరావు, నాగరాజు, ఎస్ఐ సైదాబాబుతో పాటు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

