యునైటెడ్ కింగ్డమ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి, అంతర్గత అసంతృప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
2024లో అధికారం చేపట్టిన స్టార్మర్ ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. జీవన వ్యయాలను తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే ఆ హామీలు పూర్తిగా అమలు కాలేదనే విమర్శలు పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరగడం, పార్టీ ప్రజాదరణ తగ్గడం లేబర్ నేతల్లో ఆందోళనకు కారణమైంది.
ఇదే సమయంలో పార్టీ అంతర్గతంగా నాయకత్వంపై విమర్శలు ముదిరాయి. ముఖ్యంగా సీనియర్ నేత ఆండీ బర్న్‌హామ్ వంటి నాయకులు స్టార్మర్ విధానాలను బహిరంగంగా ప్రశ్నించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇటీవల ఎన్నికల్లో ఆయనకు లభించిన విజయంతో పార్టీ లోపల కొత్త శక్తి సమీకరణాలు మారినట్టు భావిస్తున్నారు. పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే నాయకత్వ మార్పు అవసరమనే అభిప్రాయం బలపడింది. ఈ నేపథ్యంలో స్టార్మర్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక యూకే రాజకీయాల్లో లేబర్, కన్జర్వేటివ్ పార్టీలపై ప్రజల్లో విసుగు పెరుగుతుండగా, రీఫార్మ్ పార్టీ, గ్రీన్ పార్టీ వంటి ప్రత్యామ్నాయాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ మారుతున్న రాజకీయ వాతావరణం కూడా లేబర్ పార్టీ నిర్ణయాలపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు.
స్టార్మర్ రాజీనామాతో బ్రిటన్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచింది. తదుపరి ప్రధాని ఎవరు అవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
also read: మాతృత్వం ఇక కెరీర్‌కు బ్రేక్ కాదు… మహిళా క్రికెటర్లకు ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్