Homeతెలంగాణఈ నెల‌లోనే రైతు భ‌రోసా సాయం

ఈ నెల‌లోనే రైతు భ‌రోసా సాయం

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ రైతాంగం ఆశ‌గా ఎదురు చూస్తున్న రైతు భ‌రోసా సాయం సొమ్ము ఈ నెల 17 లేదా 18న రైతు ల ఖాతాల్లో జ‌మా కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే రైతుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాక నిధుల‌ను ఇప్ప‌టికే కుదుర్చుకున్న‌ది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం, ప్రజల నుంచి సానుకూలత ఉండడంతో మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది.ఈ నెలాఖరు కు పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

గత వానాకాలంలో 2025-26 ఖరీఫ్ సీజన్ 69,39,548 మంది లబ్ధిదారుల ఖాతాలలో రైతు భరోసా సాయం వేశారు. ఒక ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.8,744.13 కోట్లు బదిలీ చేశారు. తొలి రోజు ఒక ఎకరా నుంచి ప్రారంభించి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేశారు. వీరందరికీ ఈసారి కూడా బదిలీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే నిర్వహించారు.

ఎక్కడ సాగు భూమి ఉంది, బోగస్ లబ్ధిదారులు ఎవరు అనే వివరాలతో ఇటీవలే వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ సర్వేతో ఏమాత్రం సంబంధం లేకుండా వానాకాలంలో రైతు భరోసా అమలు చేసిన వారందిరికీ, ఈసారి కూడా అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వానాకాలంలో 1.46 కోట్ల ఎకరాల భూములకు రైతు భరోసా చెల్లించారు. యాసంగిలో కూడా 1.46 కోట్ల ఎకరాలకు వర్తింప చేయనున్నారు.

అయితే ఇందుకు అవసరం అయ్యే నిధులు సమకూర్చుకునేందుకు ఈ నెల 10న‌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేల కోట్ల రుణం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనున్నందున 17 లేదా 18వ తేదీ నుంచి రైతుల ఫోన్ నెంబర్లకు టింగ్ టింగ్ మంటూ మెస్సేజీలు రానున్నాయి. జనవరి నెల సంక్రాంతి పండుగ ముందే ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉండగా నిధుల లభ్యత లేకపోవడంతో ఈ నెలకు వాయిదా పడింది.

Most Popular

Recent Comments