Homeతెలంగాణక్యాంపు రాజకీయాలు షురూ..ఫలితాలు రాకముందే తరలింపు

క్యాంపు రాజకీయాలు షురూ..ఫలితాలు రాకముందే తరలింపు

• అభ్యర్థులు జారిపోకుండా ప్రధాన పార్టీల ప్రయత్నాలు

• ప్రత్యర్థి పార్టీలకు చిక్కకుండా ముందుజాగ్రత్త చర్యలు

• ఫలితాలు రాకముందే రహస్య ప్రాంతాలకు తరలింపు

• మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు తరలించిన బీజేపీ

• బీఆర్ఎస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా

ఏజెంట్లను మాత్రమే పంపనున్న గులాబీ పార్టీ అధిష్ఠానం

క్రైమ్ మిర్రర్,తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. శుక్రవారం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు గురువారమే తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించాయి. కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపాలిటీల చైర్మన్ల ఎన్నికల్లో అభ్యర్థులు గోడ దూకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసకున్నాయి.

మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీదే హవా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో వెల్లడైనా.. అవకాశం ఉన్న చోట మునిసిపాలిటీలను, కార్పొరేషన్లను దక్కించుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి.

దీంతో ఎన్నికలు పోటాపోటీగా జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మూడు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. మెజారిటీ సంఖ్యలో డివిజన్లు, వార్డులను గెటుచుకునే అవకాశం ఉన్నచోట్ల తమ అభ్యర్థులను కాపాడుకోవాలని ముందుగానే అప్రమత్తమయ్యాయి. ఎన్నికల ఫలితాల తరువాత గెలిచిన అభ్యర్థులు.. ప్రలోభాలకు లొంగి కండువా మార్చేయకుండా క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టాయి.

ప్రత్యేకించి అధికార కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్.. క్యాంపుల విషయంలో అందరి కన్నా ముందుంది. తమ పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల ఆకర్షణకు చిక్కకుండా ఎత్తులు వేస్తోంది. సూర్యాపేట లాంటి మునిసిపాలిటీలో అభ్యర్థులను ఇప్పటికే క్యాంప్ నకు తరలించారు.

మరోవైపు పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పోటాపోటీగా ఉన్న మునిసిపాలిటీలపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలా పోటాపోటీగా ఉన్న మునిసిపాలిటీల్లో అభ్యర్థుల గెలుపుతో సంబంధం లేకుండా పోటీ చేసిన అభ్యర్థులందరినీ క్యాంప్ నకు తరలించాలని ప్లాన్ చేసింది.

• సూర్యాపేటలో ఊపందుకున్న క్యాంప్ రాజకీయాలు..

సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు అందరినీ క్యాంప్ నకు తరలించారు. మొత్తం 48 మందికిగాను బుధవారం రాత్రి 44 మందిని, గురువారం మరో నలుగురిని క్యాంపునకు తరలించారు. హైదరాబాద్ లోని ఒక రిసార్ట్ లో క్యాంప్ ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత పదేళ్లుగా సూర్యాపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది.

ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. సూర్యాపేట మున్సిపాలిటీలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అభ్యర్థులు చేజారకుండా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్తగా తమ పార్టీ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించారని సమాచారం. శుక్రవారం కౌంటింగ్ పూర్తయినా.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికలు ఈ నెల 16న జరగనున్నాయి.

దీంతో అప్పటివరకు అభ్యర్థులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెండు కార్పొరేషన్లు నిజామాబాద్, కరీంనగర్ ను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. వీటితోపాటు మహబూబ్ నగర్, మంచిర్యాలలో మెరుగైన స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని అంచనా వేస్తోంది.

ఇక మునిసిపాలిటీల్లో 10 నుంచి 15 దాకా గెలుస్తామని భావిస్తున్నారు. 100కు పైగా మున్సిపాలిటీల్లో ఖాతా తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల హంగ్ వస్తే కింగ్ మేకర్స్ అవుతామని అంచనాలు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్థులను క్యాంప్ కి తరలించింది

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు