HomeజాతీయంNo-Confidence Motion: స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఏం జరగబోతోంది?

No-Confidence Motion: స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఏం జరగబోతోంది?

No-Confidence Motion Against Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షం అవిశ్వాస పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగానికి అనుమతించనందుకు, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా స్పీకర్‌పై ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీకి కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి రాజ్యంగం ఏం చెబుతోంది? సభలో ఏం జరగబోతోందంటే..

ఆర్టికల్ 94(సీ) ప్రకారం అవిశ్వాస తీర్మానం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సీ) ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదిస్తే స్పీకర్, లేదా డిప్యూటీ స్పీకర్ తమ పదవిని కోల్పోతారు. ఈ తీర్మానానికి సంబంధించి కనీసం 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. లోక్‌సభ కార్యకలాపాల నిబంధనల ప్రకారం, లోక్‌సభ ఎంపీ ఎవరైనా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. ఇందుకోసం లిఖిత పూర్వకంగా లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఆ తరువాత సభలో నిర్వహించాల్సిన కార్యకలాపాల జాబితాలో ఈ తీర్మానాన్ని చేరుస్తారు. దీనిపై చర్చకు ఒక తేదీని కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ తేదీని డిప్యూటీ స్పీకర్ నిర్ణయించనున్నారు.

తీర్మానం పక్కాగా ఉంటేనే..

ఇక నిర్ణీత తేదీన లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ సమయంలో సభలో ఉన్న కనీసం 50 మంది ఎంపీలు తీర్మానికి మద్దతు తెలిపితేనే ఓటింగ్‌కు మార్గం సుగమం అవుతుంది. లేకపోతే ఆదిలోనే ఇది వీగిపోతుంది. తీర్మానాన్ని సభ ఓటింగ్‌కు స్వీకరించాక ఎంపీలు మూజువాణీ ఓటు ద్వారా లేదా ఇతర ప్రత్యామ్నాయ ఓటింగ్ విధానాల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అయితే, ఈ తీర్మానం సభ ముందుకు వచ్చే అర్హత ఉందా? లేదా? అనే అంశం కూడా సంక్లిష్టమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్షాల తీర్మానం కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే డిప్యూటీ స్పీకర్ దాన్ని స్వీకరిస్తారు. ఎలాంటి సాంకేతిక, ఇతరత్రా లోపాలు ఉండకూడదు. తీర్మానంలో ప్రతిపక్షాలు పేర్కొన్న ఆరోపణలు స్పష్టంగా ఉండాలి. సభ్యుల వాదనలు, అభిప్రాయాలు, అన్వయాలు, అవమానకరంగా ఉండే వ్యాఖ్యలకు అవిశ్వాస తీర్మానంలో చోటు ఉండదు. ఇందుకు అనుగుణంగా ఉన్న తీర్మానాన్నే డిప్యూటీ స్పీకర్ స్వీకరిస్తారు.

మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ   

ఇక ఈ అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న చర్చ జరిగే అవకాశం ఉంది. ఓటింగ్‌ రోజున సభలో ఉన్న మెజారిటీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటువేస్తేనే ప్రతిపక్షాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమికి 293 ఎంపీల మద్దతు ఉంది. ప్రతిపక్ష ఐఎన్‌డీఐఏ కూటమిలో 238 ఎంపీలే ఉన్నారు. దీంతో, అవిశ్వాస తీర్మానంపై వీగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు