-
ముగ్గురు కూతుర్లకు తండ్రి దూరం
-
కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తుల ఆర్థిక చేయూత
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో విషాదం నెలకొన్న వేళ మానవత్వం పరిమళించింది. ఇటీవల మోకాలు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న క్రమంలో, హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన, పంగ కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.
ముగ్గురు కూతుర్లు ఉన్న ఆ నిరుపేద కుటుంబానికి ఇంటి యజమాని మరణం కోలుకోలేని దెబ్బగా మారిన నేపథ్యంలో, సోమవారం నాడు మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, కాంటెస్టెడ్ సర్పంచ్ పులిమామిడి నర్సింహారెడ్డి స్థానిక నాయకులతో కలిసి మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కృష్ణయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు గ్రామపెద్దలు, యువకులు, మిత్రులు, దాతల సహకారంతో సేకరించిన 90 వేల నగదును మృతుడి భార్య అలివేలుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జమ్ముల వెంకటేష్, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి, నిమ్మరాసు రమేష్ సహా పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొని, చిన్నారుల చదువులకు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో ఒకరికి ఒకరం అండగా ఉండటమే తమ బాధ్యతని గ్రామ పెద్దలు చాటిచెప్పగా, తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.