-ఈసారి రైస్ మిల్లర్లు టార్గెట్
-ధాన్యం ఎగవేత, డిఫాల్టర్ల పై గురి పెట్టేందుకు ప్రత్యేక టీం
-పోలీస్ శాఖ నుంచి పౌరసరఫరాల శాఖకు 28 మంది సుశిక్షితులైన సిబ్బంది
-తెలంగాణలో మున్ముందు సంచలనాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న రైస్ మిల్లర్లపై కమాండోల ప్రయోగం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దాన్యం మిల్లింగ్, కష్టం మిల్డ్ రైస్ అప్పగింతలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై దృష్టి పెట్టింది. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ధాన్యాన్ని, నిధులను ఎగవేస్తున్న రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అత్యంత కఠినమైన అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ బలగాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నుంచి ఎంపిక చేసిన 28 మంది సుశిక్షితులైన సిబ్బందిని.. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ విభాగానికి డిప్యూటీషన్ పై అటాచ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రైస్ మిల్లర్లది కీలక పాత్ర..
ప్రభుత్వ రేషన్ సరఫరా లో రైస్ మిల్లర్లది కీలక పాత్ర. ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సహకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తారు మిల్లర్లు. తిరిగి ప్రభుత్వ నిల్వలకు బియ్యం అందించాల్సిన బాధ్యత కూడా వారిదే. అయితే కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని రీసైకిలింగ్ చేయడం, బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం లేదా నిర్దిష్ట గడువులోగా ప్రభుత్వానికి బియ్యం అప్పగించలేదు. చాలామంది డిఫాల్ట్ అవుతున్నారు. అంతటితో ఆగకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025 – 26లో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దాదాపు 40 వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ పరిస్థితుల్లో ఇంతటి భారీ ప్రజాధనాన్ని కాపాడేందుకు.. ఎగవేతకు పాల్పడుతున్న రైస్ మిల్లర్ల పై సర్కార్ నిఘా పెట్టింది.
సంచలన నిర్ణయమే..
ఏకంగా పోలీస్ వ్యవస్థల్లో నుంచి ఇలా సిబ్బందిని తీసుకోవడం మాత్రం సంచలనమే. అయితే పోలీస్ శాఖకు ఈ పౌరసరఫరాలు అనేవి భిన్నంగా ఉంటాయి విధులు. అందుకే ఈ కమాండో బృందానికి శిక్షణ ఇస్తున్నారు. వీరి వ్యూహాత్మక ఆపరేషన్ అనుభవం, ఆకస్మిక దాడులు నిర్వహించే నైపుణ్యంతో రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులపై మెరుపు దాడులు చేపట్టేందుకు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా హైడ్రా తరహాలో.. ఈ కమాండో ఆపరేషన్ సైతం సరికొత్త సంచలనాలకు తెరతీసే అవకాశం ఉంది.
