క్రైమ్ మిర్రర్, సినిమా:- మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా వైరల్‌గా మారింది. చిరంజీవిపై తన అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ బన్నీ చేసిన పోస్టులో ఉన్న ఓ హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే #KKAVCF. చిరంజీవిని ఉద్దేశించి అల్లు అర్జున్ తన పోస్టులో ఆయన తమకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని పేర్కొన్నారు. తనతో పాటు ఎంతో మందికి చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని, ఎదుగుతున్న వారికి ఆయన అందించిన ప్రోత్సాహం ఎంతో విలువైనదని కొనియాడారు. మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.అయితే ఈ పోస్టులో ఉపయోగించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ మాత్రం అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. దాని పక్కన ఐవైకేఐకే అనే పదాన్ని కూడా ఉపయోగించడంతో అసలు దాని వెనుక ఉన్న అర్థం ఏమిటనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. #KKAVCF అంటే కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యాన్ అనే అర్థం వస్తుంది. అంటే జీవితాంతం చిరంజీవికి అభిమానిగానే ఉంటాననే భావాన్ని బన్నీ ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సినిమాలంటే తాగుడు, తినుడు, పంచాయితీలేనా.. రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
గతంలో కూడా అల్లు అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై తన అభిమానాన్ని ఇదే తరహా పదాలతో వ్యక్తం చేశారు. ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బన్నీ అదే భావాన్ని మరోసారి గుర్తు చేయడం ఆసక్తికరంగా మారింది.కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం ఉందంటూ సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య సంబంధాలపై తరచూ చర్చ నడుస్తోంది. అయితే ఇలాంటి ప్రచారాల నేపథ్యంలో చిరంజీవి పుట్టినరోజున బన్నీ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
చిరంజీవిపై తనకు ఉన్న గౌరవం, అభిమానం ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్పేలా అల్లు అర్జున్ పోస్టు ఉందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా #KKAVCF ద్వారా తాను మెగాస్టార్‌కు ఎంతటి అభిమానినో బన్నీ మరోసారి స్పష్టం చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
