క్రైమ్ మిర్రర్ : అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. దోపిడీ కోసం దుకాణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కాల్పులు జరిపి వ్యాపారిని హతమార్చాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన జాక్సన్ పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీటీవీలో నమోదైన అతడి దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేసి, సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఆఖాజ్ గ్రామానికి చెందిన సురేశ్ పర్సోత్తమ్‌దాస్ పటేల్ (56) సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికాలోని చికాగోలో నివసిస్తున్నారు. ఇటీవల జాక్సన్ నగరంలో ‘రిడ్జ్‌క్రెస్ట్ సెల్లార్స్’ పేరుతో ఓ వైన్ షాప్‌ను ప్రారంభించారు. ఈ దుకాణం ప్రారంభించి వారం రోజులు కూడా పూర్తికాకముందే విషాదం చోటుచేసుకుంది.
ఆగస్టు 20న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించాడు. తుపాకీ చూపించి క్యాషియర్‌ను బెదిరించి నగదు తీసుకున్నాడు. అనంతరం అక్కడే ఉన్న సురేశ్ పటేల్‌పై పలుమార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
కాల్పులు జరిగిన సమయంలో సురేశ్ పటేల్ కుమార్తె కూడా ఆయన పక్కనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కళ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో మరో మహిళా ఉద్యోగికి కూడా గాయాలయ్యాయి. కాల్పుల సమయంలో ఏర్పడిన భయాందోళనలతో 70 ఏళ్ల ఉద్యోగి కిందపడిపోవడంతో ఆమె మణికట్టుకు తీవ్ర గాయమైందని పోలీసులు వెల్లడించారు.
మొత్తం ఘటన దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అతడి చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేసి, నిందితుడి గురించి ఏదైనా సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. ప్రస్తుతం హత్య, దోపిడీ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
also read :సూట్‌కేస్ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఇంట్లో కనిపించిన దృశ్యాలతో షాక్
