క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఇది ముగిసిందని భావించారు. కానీ మరోసారి వీధికి ఎక్కింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు.. మరోసారి గులాబీ పార్టీ నేతలకు సరికొత్త సవాల్ చేశారు.
సాయంత్రం ఐదు గంటలకు అప్పుల పూర్తి జాబితా, ఆధారాలతో తాను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వస్తున్నానని.. దమ్ముంటే రావాలంటూ ఆయన గడువు విధించారు. అయితే నిన్ననే ఈ సవాళ్ల పర్వంలో కాంగ్రెస్ వెనుకబడింది. ఈరోజు మరోసారి తెరపైకి తేవడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది.
-
తెలంగాణలో భిన్న వైఖరి..
ఏ రాష్ట్రంలోనైనా అధికారపక్షం, విపక్షం మధ్య సవాల పర్వం నడుస్తూ ఉంటుంది. కానీ దానికి అత్యున్నత వేదికగా చట్టసభలు ఉంటాయి. అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రాలు విడుదల చేయడం, గణాంకాలతో విపక్షాల నోళ్లు నొక్కడం అధికార పార్టీలకు పరిపాటి. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ భిన్నమైన వైఖరిని అనుసరిస్తోంది.
శాసనసభలో చర్చ జరపకుండా.. తెలంగాణలోని ప్రెస్ క్లబ్బులు.. చౌరస్తాల వేదికగా సవాళ్లు విసరడానికి ప్రాధాన్యం ఇస్తుండడంపై విస్మయం వ్యక్తం అవుతుంది. పరిపాలనపై దృష్టి పెట్టాల్సిన అధికారపక్షమే ఇటువంటి వీధి చర్చలను కొనసాగిస్తుండటం మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
రాజకీయంగా కార్నర్..
మరోవైపు అధికారపక్షం విపక్ష మాదిరిగా వ్యవహరిస్తుండడం మాత్రం విస్మయం వ్యక్తం అవుతోంది. సాధారణంగా శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందున.. తమ మైకులు కట్ చేస్తున్నందున.. బయట వేదికల్లో మాట్లాడడం అనేది సహజం. ఏపీలో జరుగుతోంది అదే. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి.. వారాంతపు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ సైతం అలానే వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ రకమైన రివర్స్ పాలిటిక్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ లాభపడడం కంటే రాజకీయంగా కార్నర్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజా సమస్యలను రాష్ట్ర ఆర్థిక వాస్తవాలను సభలో పెట్టి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాల్సింది పోయి.. ఇలా ప్రెస్ మీట్లకు, సవాళ్లకు పరిమితం కావడం ఎంత మాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.