తెలంగాణను వరుణుడు వదలడం లేదు. ఇప్పటికే కరవాల్సిన వర్షం కన్నా ఎక్కువ వర్షం పడింది. అయినా మళ్లీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగాతెలంగాణకు వాతావరణశాఖ మరోసారి వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.
ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read More : హైడ్రా బాధితుల భయం.. గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు
గంటకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో పొడి వాతావరణం ఉండనుంది. ఉదయం ఎండగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటి వరకు తెలంగాణలో 71.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షం పాతం కన్నా 40 శాతం అధికం.