తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. గురువారం పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం, డిప్యూటీలు పార్టీ పెద్దలతో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. 11 మంది మంత్రులతోనే ఏడాది పాలన సాగింది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత ఆరు నెలలుగా ప్రచారం సాగుతున్నా కాలేదు. కాని ఈసారి ఖాయమని తెలుస్తోంది.
ఈనెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా తెలిపారు. దీంతో ఆరుగురు కొత్త మంత్రుల జాబితానే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలు, సామాజిక సమీకరణల ఆధారంగా కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చోటు లేదు. ఈసారి ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తారని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రేసులో ఉన్నారు. వివేక్ కోసం రేవంత్.. ప్రేంసాగర్ కోసం భట్టి ప్రయత్నిస్తున్నారు. వివేక్ కంటే ప్రేంసాగర్ రావుకే ఛాన్స్ ఉందంటున్నాకు.
నిజామాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే సామాజిక వర్గాల కూర్పు.. నల్గొండ జిల్లా సమీకరణలు బట్టి ఈ జిల్లా నుంచి అవకాశం ఉందంటున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రేవంత్ వర్గం చెబుతోంది. హైదరాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరూ లేరు. ఇటీవల గెలిచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. మంత్రి పదవికి పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు శ్రీ గణేష్ పేరు వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కోటాలో కోదండరాం పేరు కూడా వస్తోంది.
మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్ బెర్త్ కోసం పట్టుబడుతున్నారు. బీజేపీ నుంచి పార్టీలోకి వచ్చినప్పుడే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రిపదవి ఇస్తానని సీఎం రేవంత్ తమ నేతకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. అయితే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్, వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. మూడో మంత్రి పదవి ఇవ్వడనే కష్టం అయితే.. అది రెడ్డీకి ఇవ్వడం మరింత కష్టం. దీంతో రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీ చీఫ్ విప్ పదవి ఇస్తారనే టాక్ వస్తోంది. లంబాడాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్ వస్తోంది. ఈ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ రేసులోకి వచ్చారు. మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాకపోతే బాలునాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని తెలుస్తోంది.