-
ఆమె ఉదాశీనం తెలంగాణ కాంగ్రెస్ కు శాపం
-
ఆదిలోనే కట్టడి చేయలేకపోయిన వైనం
-
రాహుల్ సన్నిహితురాలి వైఫల్యం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ గాడి తప్పుతోంది. రోజురోజుకు ఆ పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారుతోంది. సీనియర్లు అసంతృప్త బాట పడుతున్నారు. మంత్రులు సైతం పక్కదారి పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెడుతున్నారు.
ఒకరిపై ఒకరు బాహటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.
అవినీతి ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సరిగ్గా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
-
కాంగ్రెస్ అగ్ర నేతకు సన్నిహితురాలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు మీనాక్షి నటరాజన్. అవినీతి మచ్చలేని కఠినమైన నాయకురాలిగా ఆమెకు పేరు ఉంది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీని గాడిలో పెడతారని.. గాడి తప్పిన వారిని ఉపేక్షించరని అంతా భావించారు.
కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను ఆమె పెద్దగా పట్టించుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సొంత అజెండాలు, అంతర్గత ముఠా తత్వాల ముందు ఆమె వ్యూహాలు తేలిపోయినట్లు కనిపిస్తోంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా.. బుజ్జగింపు రాజకీయం అనుసరించడంతో నేతలు ఆమె ఆదేశాలను పట్టించుకోవడం లేదు.
-
ప్రాథమిక దశలో గుర్తించని వైనం..
కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చేయి దాటి పోయిన వరకు పట్టించుకునే నాయకుడు లేరు. సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించడంలో, క్రమశిక్షణ తప్పిన నేతలపై వెంటనే వేటు వేయడంలో ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో బలపడింది.
అంతర్గత విభేదాలు రచ్చకెక్కిన ప్రతిసారి కమిటీల ఏర్పాటు లేదా చర్చల పేరుతో కాలాన్ని వెల్లతీయడం, గట్టి చర్యలు లేకపోవడంతో నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. మరోవైపు ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లో రాజ్యసభ పదవి కోల్పోవడానికి తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కారణమని తెలియడం కూడా ఆమె ఉదాసీనతను బయటపెడుతోంది.
-
సురేఖ పై చర్యలు తీసుకుని ఉంటే..
ప్రస్తుతం కొండా సురేఖ ఉదంతాన్ని తీసుకుందాం. ఆమెపై గతంలోనే చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. సురేఖ వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆమె ప్రధాన అనుచరుడు సుమంత్ పై కూడా అనేక ఆర్థిక సెటిల్మెంట్ ఆరోపణలు వచ్చాయి. పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి.
అయితే పార్టీకి హై కమాండ్ గా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ చూసి చూడనట్టుగా వెళ్లారు. ఇప్పుడు ఏకంగా కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ నేరుగా సీఎం రేవంత్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై గురి పెట్టారు. మీనాక్షి నటరాజన్ ఉదాసీనత తెలంగాణ కాంగ్రెస్ పట్ల శాపంగా మారింది. ఇకనైనా ఆమె కఠిన దండనకు దిగుతారా? లేదా? అనేది చూడాలి.
