Homeఅంతర్జాతీయంVolkswagen Layoffs: బిగ్ షాట్.. ఫోక్స్‌ వాగన్‌ లో లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Volkswagen Layoffs: బిగ్ షాట్.. ఫోక్స్‌ వాగన్‌ లో లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన!

ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన ఫోక్స్‌ వాగన్‌ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఉద్యోగుల కోతలతో పాటు జర్మనీలోని నాలుగు తయారీ కర్మాగారాలను మూసివేయాలని కూడా కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఫోక్స్‌ వాగన్‌ సీఈవో ఒలివర్‌ బ్లూమ్‌ ఇటీవల కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. జూలై 9న జరగనున్న సూపర్‌వైజరీ బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఫోక్స్‌ వాగన్‌ లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో దాదాపు 15 శాతం మందిపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా జర్మనీలోనే కంపెనీ ఉద్యోగుల్లో 43 శాతం మంది పనిచేస్తుండటంతో అక్కడి ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడనుంది.

చైనా ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ, అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు, ఐరోపాలో పెరిగిన ఉత్పత్తి వ్యయాలు కంపెనీపై ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఫోక్స్‌వాగన్‌ ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే కంపెనీ నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు 89 ఏళ్ల ఫోక్స్‌వాగన్‌ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. ఫోక్స్‌వాగన్‌ సంస్థ ఫోక్స్‌ వాగన్‌, ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ కార్లతో పాటు స్కానియా వాణిజ్య వాహనాలు, డుకాటీ ద్విచక్ర వాహనాలను కూడా తయారు చేస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు