-
దానం నాగేందర్ విషయంలో పునరాలోచన
-
ప్రజా వ్యతిరేకత వస్తుందని భావన
-
పీజేఆర్ కుమార్తెను బరిలో దింపే ఛాన్స్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తలుపు తట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే గత ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు దానం నాగేందర్. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా.. బిజెపి మూడో స్థానంలో నిలిచింది.
ఆ రెండు పార్టీలు భారీగా ఓట్లు చీల్చడంతో సునాయాసంగా గెలుపొందారు దానం నాగేందర్. అయితే మరోసారి ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ ను బరిలో దించుతారా? లేదా? అనేది సందేహమే. ఈ తరుణంలో పి. జనార్దన్ రెడ్డి కుమార్తె విజయా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తానే బరిలో దిగుతానని ప్రకటించారు. కేవలం దానం నాగేందర్ ఎంపీ టికెట్ కోసమే పార్టీ మారారని.. ఈసారి ఆయనకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. సహజంగానే ఇది దానం నాగేందర్ శిబిరంలో ఆందోళన కలిగించే విషయమే.
-
నాగేందర్ అసంతృప్తి..
ఇటీవల హైకోర్టు అనర్హత వేటు వేయగా దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆయనపై ఉన్న అనర్హత వేటు 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
కచ్చితంగా పోటీలో ఉంటానని.. ఏ పార్టీ తరపున అనేది స్పష్టత ఇవ్వలేదు నాగేందర్. ఇటువంటి సమయంలో గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయా రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
కచ్చితంగా తాను పోటీ చేస్తానని.. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో తనకు ప్రజా మద్దతు ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే విజయా రెడ్డికి పార్టీ హై కమాండ్ హామీ ఇచ్చిందా? దానం నాగేందర్ డ్రాప్ అవుతారా? ఆయనను ఎమ్మెల్సీగా సరిపెట్టి మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
-
త్రిముఖ పోటీలో..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున విజయా రెడ్డి, భారత రాష్ట్ర సమితి తరపున దానం నాగేందర్, బిజెపి తరఫున చింతల రామచంద్రారెడ్డి పోటీ చేశారు. దానం నాగేందర్ కు 67368 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి విజయా రెడ్డికి 45358, చింతల రామచంద్రారెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడమే కాదు.. ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్. ఆయన మూలంగానే ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. అయితే గతంలో కూడా ఇదే మాదిరిగా ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు దానం నాగేందర్. కానీ ఓటమి ఎదురయింది. మరోసారి ఆ పరిస్థితి తప్పేలా లేదు.
అందుకే దానం నాగేందర్ ను తప్పించి.. గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయా రెడ్డి వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు పి.జనార్దన్ రెడ్డి.
ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినాయకత్వం విజయా రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.
